Mobile Phones Theft Gang Arrested In Hyderabad : హైదరాబాద్‌లో సెల్‌ఫోన్లను చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ఇంటర్నేషనల్ ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో సుడాన్ దేశస్థులు మరి కొందరి వ్యక్తులతో కలిసి ఒక ముఠాగా మారి నిరుద్యోగులను అసరాగా చేసుకుని చోరీలకు తెరదీశారని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఈ ముఠా రాత్రిళ్లు రోడ్లపై వెళ్లేవారిని టార్గెట్‌గా చేసుకుని సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నారు. నైట్ టైమ్‌లో రోడ్లపై వెళ్లేవారితో బస్సు వస్తుందా? టైం ఎంత? అని అడిగి వారితో మాటలు కలిపి వాళ్లకు తెలియకుండా సెల్‌ఫోన్ లాక్కొని పోతున్నారు. అయితే సెల్‌ఫోన్ పోయిందంటూ ఒకరిద్దరు తమ వద్దకు వస్తే నార్మల్ థెప్ట్ కేసని భావించిన పోలీసులు, చోరీ అవుతున్న ప్యాటర్న్‌ను గమనించారు. ఆ తర్వాత వరుసగా వందల కేసులు రావడంతో దీని వెనక పెద్ద ముఠా ఉందని గ్రహించారు. అలా వీరిపై నిఘా పెట్టి తాజాగా ఈ ముఠాను అరెస్టు చేశారు.
"చోరీకి గురైన, దెబ్బతిన్న సెల్‌ఫోన్లను జగదీష్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దెబ్బతిన్న సెల్‌ఫోన్లను జగదీష్ మార్కెట్‌లో డిస్మెంటల్ చేస్తున్నారు. ఎలమంద రెడ్డి అనే వ్యక్తి జగదీష్ మార్కెట్‌లో కౌంటర్ పెట్టాడు. ఐఫోన్లను సైతం రూ.8 వేల నుంచి అమ్ముతున్నారు. సెల్‌ఫోన్లు సముద్ర మార్గం ద్వారా సూడాన్ తరలిస్తున్నారు. విమానాశ్రయాల్లో నిఘా ఎక్కువ ఉంటుందని పడవల్లో తరలిస్తున్నారు. స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్‌ను విడివిడి భాగాలను కూడా అమ్ముతున్నట్లు విచారణలో గుర్తించాం." - కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సీపీ
Mobile Stealing Gang In Hyderabad : 12 మంది హైదరాబాద్ వాసులు, ఐదుగురు సుడాన్‌కు చెందిన వారు ముఠాగా ఏర్పడి, ఇలా రాత్రిళ్లు చోరీలకు పాల్పడి వచ్చిన సెల్‌ఫోన్లను సుడాన్ సహా ఇతర దేశాలకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. అపహరణకు గురైన కొన్ని జగదీష్ మార్కెట్ అడ్డాగా చేసుకుని విక్రయిస్తున్నారని వెల్లడించారు. చోరీ చేసిన వాటిలో దెబ్బతిన్న ఫోన్లను డిస్మెంటల్ చేస్తున్నారని చెప్పారు.
అపహరించిన ఫోన్లను విక్రయించడానికి ఎలమంద రెడ్డి అనే వ్యక్తి జగదీష్ మార్కెట్‌లో కౌంటర్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఐఫోన్లను రూ.8వేలకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇతర ఫోన్లను జమ చేసి డేటా అంతా క్లియర్ చేసి వాటన్నింటి మళ్లీ ఇతర దేశాలలకు తరలిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో నిఘా ఎక్కువ ఉంటుందన్న కారణంతో వాటిని సముద్ర మార్గాన తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
దొంగలున్నారు జాగ్రత్త - భాగ్యనగర వాసులను కలవరపెడుతున్న వరుస చోరీలు - Robbery Incidents in Hyderabad