Parents Complaint About Daughter In Hyderabad : వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన పిల్లలే ఆస్తుల కోసం వారితో గొడవలు పడుతున్నారు. వారు సంపాదించిన డబ్బులను కావాలంటూ దాడులకు దిగుతున్నారు. కుమారుల కంటే కుమార్తెలే తల్లిదండ్రులను బాగా చూసుకుంటారని అంటారు. కానీ డబ్బు ముందు బంధుత్వాలకు చోటే లేదు. కేవలం డబ్బే సర్వస్వం అనుకొని నేటి రోజుల్లో బతుకుతున్నారు. డబ్బుంటే చాలు తల్లిదండ్రులు అవసరం లేదన్న రీతిలో కొందరి వ్యవహారం ఉంటుంది. ఈ ఘటనను చూస్తే మాత్రం కుమారుడికి, కుమార్తెకు భేదం లేదని తెలుస్తోంది. తల్లిదండ్రుల దగ్గర బంగారం తీసుకొని తిరిగి ఇవ్వకుండా కుమార్తె నాన్చుతూ వస్తోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి సర్కిల్ వాణీనగర్‌లో బుధవారం జరిగింది. కుమార్తె మోసం చేసిందని తల్లిదండ్రులే ఆమె ఇంటి ముందు పది మందితో కలిసి నిరసనకు దిగారు.
స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే : మల్కాజిగిరిలో శివమ్మ, మల్లయ్య దంపతుల కుమార్తె బాలమణి వారి ఇంటికి సమీపంలోనే ఉంటోంది. ఈ దంపతులు రెండేళ్ల క్రితం ఊరెళ్తూ వారి వద్దనున్న 30 తులాల బంగారాన్ని దొంగల భయానికి కుమార్తెకు దాచమని ఇచ్చారు. ఇంటికి వచ్చాక తిరిగి బంగారం ఇవ్వమనడంతో ఆమె నిరాకరిస్తుందని వృద్ధ దంపతులు తెలిపారు. చాలా సార్లు అడిగినా ఆమె ఆ బంగారం ఇవ్వకపోవడంతో బుధవారం వినియోగదారులు, మానవహక్కుల పరిరక్షణ సమితి సభ్యుల సహాయంతో ఆ దంపతులు తాము ఇచ్చిన బంగారం మళ్లీ తిరిగి తమకు ఇవ్వాలని కుమార్తె ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
గతంలో చాలా సార్లు దీని గురించి పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవట్లేదని ఆ దంపతులు వాపోయారు. కన్న కుమార్తె ఇలా చేయడం భావ్యమా అంటూ వృద్ధాప్యంలో తమను రోడెక్కెలా చేసిందని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంగారం తమకు కావాలని అడుగుతున్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వృద్ధులను, ఆమె కుమార్తెను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ మధ్య డబ్బు కోసం కన్న తల్లిదండ్రులనే కడతేర్చుతున్న పుత్రరత్నాల గురించి వార్తలు ఎన్నో వస్తున్నాయి. జన్మనిచ్చిన కన్నవారిని తుది శ్వాస వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటమే కన్నపిల్లలుగా వారికి మనం ఇచ్చే బహుమతి.
'ఆ ముగ్గురు ఎవరికి వారు బతుకుతున్నారు - ఈ కుమారుడు మమ్మల్ని హింసించడమే పనిగా పెట్టుకున్నాడు'