Hyderabad Metro Phase 2 Expansion : హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు రెండో దోశ విస్తరణను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండోదశ కారిడార్‌లోని ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్, నాగోల్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, మియాపూర్ నుంచి పటాన్‌చెరు మార్గంలో రెండు రోజులపాటు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. జాతీయ రహదారుల అధికారులతో కలిసి మెట్రో అలైన్మెంట్ విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు.
Metro MD Review With Highway Officials : ప్రతిపాదిత మెట్రో రెండోదశ మార్గాల్లో ఇప్పటికే ఉన్న పైవంతెనలు, కొత్తగా చేపట్టే, నిర్మాణంలో ఉన్న పైవంతెనల వద్ద ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాలపై హైవే అధికారులతో చర్చించారు. ఎల్బీనగర్-హయత్‌నగర్ కారిడార్ సుమారు 7 కిలోమీటర్లు ఉంటుంది. ఎల్బీనగర్ కూడలి వద్ద ఇప్పటికే ఉన్న వయాడక్ట్ పొడిగింపుగా నిర్మించనున్నారు. ఎస్ఆర్డీపీలో ఫ్లైఓవర్లు నిర్మించేటప్పుడే మెట్రో కోసం వదిలిన డివైడర్ మార్గంలోనే చింతల్‌కుంట మెట్రోస్టేషన్ వరకు మార్గం వస్తుంది.
మెట్రో అలైన్మెంట్ : చింతలకుంట నుంచి హయత్‌నగర్ వరకు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న 4 కొత్త ఫ్లైఓవర్ల దృష్ట్యా ఎడమవైపు సర్వీస్ రోడ్డులో మెట్రో అలైన్మెంట్ ఉంటుంది. అలాగే నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు, మెట్రోరైలు స్తంభాలు, వయాడక్ట్, స్టేషన్ల ఇంజినీరింగ్ డ్రాయింగ్‌లు ఏవైనా వివాదాలను నివారించడానికి రెండు సంస్థల అధికారులతో సమన్వయం చేసుకోనున్నారు. ఈ కారిడార్‌లో. ప్రతిపాదిత ఆరు స్టేషన్లలో కొన్నింటిని ఫ్లైఓవర్ల కారణంగా కొద్దిగా సర్దుబాటు చేయనున్నారు. రహదారి ఇరువైపుల నుంచి మెట్రోస్టేషన్‌కు చేరుకునేందుకు వీలుగా నిర్మాణం ఉండేలా ఆ మార్పులు చేయనున్నారు.
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కమ్ మెట్రో వయాడక్ట్ : మియాపూర్-పటాన్‌చెరు మార్గం సుమారు 13 కిలోమీటర్లు ఉంటుంది. మెట్రో కారిడార్‌లో బి.హెచ్.ఇ.ఎల్ కూడలిలో మినహా జాతీయ రహదారి సెంట్రల్ మీడియన్లలో నిర్మించాలని ప్రతిపాదించారు. మదీనాగూడ గంగారాం వద్ద 1.2 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎన్.హెచ్ అధికారులు ప్రణాళికలురూపొందించారు. ఇక్కడ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కమ్ మెట్రో వయాడక్ట్‌ను సంయుక్తంగా నిర్మించే అంశంపై సాధ్యాసాధ్యాలను అన్వేషించనున్నట్లు తెలిపారు.
ఇరుకుదారులు, ఇరువైపుల భూగర్భ ఓవర్హెడ్ కేబుల్స్, కుడివైపు మతపర నిర్మాణాలు ఉండటంతో ఇక్కడ డబుల్ డెక్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదంకోసం డ్రాయింగ్‌ను సిద్ధంచేసి సమర్పించనుంది. బీహెచ్ఇఎల్ కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న ఫైఓవర్ ఎడమవైపునకు మెట్రో అలైన్‌మెంట్ ఖరారు చేశారు. బీహెచ్ఇఎల్ జంక్షన్ వద్ద ఉన్న టీజీఎస్ఆర్టీసీ బస్ స్టాప్‌తో, ఈ మెట్రో స్టేషన్ అనుసంధానమవుతుందని అధికారులు తెలిపారు.
ఎయిర్పోర్ట్ మార్గంలో మెట్రో విస్తరణ : విమానాశ్రయ మార్గంలో ఎయిర్‌పోర్టు మెట్రోకారిడార్లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి నూతన హైకోర్టు వరకు సుమారు 5 కిలోమీటర్ల మెట్రో పొడిగింపు ప్రతిపాదన ఉంది. ఆరాంఘర్ వద్ద పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకి ఎడమవైపున మెట్రో మార్గం వస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాయం వైపు ఫ్లైఓవర్ మధ్య అనువైన ప్రదేశంలో మెట్రో మార్గం కుడివైపు అలైన్మెంట్ మారుతుంది.