Research on Food Delivery Boys in Hyderabad : మార్నింగ్ టిఫన్ నుంచి రాత్రి భోజనం వరకూ ఇళ్లకు, ఆఫీస్‌లకు నిర్విరామంగా ఫుడ్ డెలివరీ చేస్తున్న వారు సమయంతో పోటీ పడుతున్నారు. వారితో పని చేయించుకుంటున్న సంస్థలు వేగంగా లక్ష్యాలకు చేరాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, వర్షాల వంటి పరిస్థితుల్లో సమయానికి ఆహారాన్ని గమ్యస్థానాలకు చేర్చలేకపోతున్నారు. దీంతో కమిషన్ వెనక్కి తీసుకుంటున్నారు. పైకి రోజంతా తిరిగే ఉద్యోగమే అయినా, మెట్రో నగరాల్లో ఫుడ్ డెలివరీ బాయ్‌ల జీవితాలు కష్టతరంగా మారాయని హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
వర్తించని చట్టాలు : కోహ్లి సెంటర్ ఫర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌లో ప్రొఫెసర్ నిమ్మి రంగస్వామి, పరిశోధక విద్యార్థి తన్మయి గోయల్‌లు హైదరాబాద్, చెన్నె, ముంబయిలలో వేల మంది ఫుడ్ డెలివరీ బాయ్‌లను కలుసుకుని కష్టాలు అడిగి తెలుసుకున్నారు. వారు గిగ్ వర్కర్ల జాబితాలో ఉన్నా, కార్మిక చట్టాలు డెలివరీ బాయ్స్‌కు వర్తించడం లేదని గుర్తించారు. ఈ అధ్యయనం కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితం కాగా, బార్సిలోనాలో ఇటీవల జరిగిన యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ ఆంత్రోపాలజిస్ట్ సదస్సులో ప్రత్యేకంగా దీనిపై ప్రస్తావించారు.
స్విగ్గీ, జొమాటో కుర్రాడు - కొట్టాడు 3 సర్కారీ నౌకరీలు - Delivery Boy Got 3 Govt Jobs
ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నా - అందుకోలేని పరిస్థితి : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ సంస్థల్లోని డెలివరీ బాయ్స్‌కు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ప్రొ.నిమ్మి రంగస్వామి, గోయల్ గుర్తించారు. ముంబయి, చెన్నై, హైదరాబాద్‌లో ఒకేలా పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. ఆయా సంస్థలు ఒక్కో డెలివరీకి కమీషన్‌తో పాటు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు కానీ, అవి అందుకోవాలి అంటే పెట్టిన టార్గెట్ పూర్తి చేయాలి. కానీ అది అందుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఒకరోజు గరిష్ఠంగా వందకు పైగా ఆహార పదార్థాలు రవాణా చేస్తే నగదు బహుమతి ఇస్తామంటున్నా, భారీ లక్ష్యం కావడంతో ఏరోజూ దక్కని పరిస్థితి ఏర్పడుతుంది.
వారికి రోడ్డు ప్రమాదాలు జరిగినా పట్టించుకోవడం లేదు : వినియోగదారుడికి అనుకున్న సమయంలోగా ఆహారం చేర్చాలన్న లక్ష్యంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ వేగంగా వెళ్తున్నపుడు ప్రమాదాలైనా సంస్థలు పట్టించుకోవడం లేదని వాపోయారు. సకాలంలో ఆర్డర్‌ను ఇవ్వనందుకు వినియోగదారులకు మరో ఆర్డర్ పంపిస్తున్నారు తప్ప, వారిని ఆసుపత్రిలో చేర్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు ఆర్డర్లు రద్దు చేసినపుడు ‘మీరు సకాలంలో ఆర్డర్ ఇవ్వలేదు, అందుకే రద్దు చేశారు’ అంటూ నెపం వారిపై వేసి జరిమానాలు విధిస్తున్నారని తెలిపారు. డెలివరీ బాయ్స్‌గా ఎక్కువగా మైనర్ల నుంచి ఇరవై ఏళ్లలోపు ఉన్నవారినే ఎంచుకుంటున్నారని రంగస్వామి చెప్పారు. గిగ్ వర్కర్ల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి కోరారు.
సైకిల్‌పై 'ఫుడ్' డెలివరీ.. యువకుడిని చూసి పోలీసులు చేసిన పనికి..!
పగలు డెలివరీ బాయ్.. రాత్రి సెక్యూరిటీగార్డ్.. భిక్షాటన మానేసి కుటుంబాన్ని పోషిస్తున్న దివ్యాంగుడు