Cyber Crimes Through Snapchat : గతేడాది సెప్టెంబరులో బెంగళూరులోని నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న లింకును టీటీ న్యాబ్ పోలీసులు ఛేదించారు. సినీ ప్రముఖులు కూడా నిందితుల దగ్గర డ్రగ్స్ కొంటున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ముఠాను వినియోగదారులు ఎలా సంప్రదిస్తున్నారని ఆరా తీయగా స్నాప్‌చాట్ యాప్ అని తేలింది. సందేశాలు పంపించగానే అవతలి వ్యక్తి అవి చూడగానే అదృశ్యమవుతాయి. దీంతో ఈ మాధ్యమం ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని తేలింది.
తన కుమార్తె నగ్నచిత్రాలు సేకరించి ఓ వ్యక్తి వేధిస్తున్నాడని నగర సైబర్‌క్రైమ్ పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు దాదాపు 15 రోజులు దర్యాప్తు చేసి ఆ యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు స్నాప్‌చాట్‌లో బాలిక నగ్నచిత్రాలు సేకరించి, ఇతరులకు షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాప్‌లోని సౌలభ్యాల దృష్ట్యా ఈ మాధ్యమం ఉపయోగిస్తున్నట్లు తేల్చారు.
ఆకర్షితులవుతున్న యువత : స్నాప్‌చాట్‌లో ఏదైనా ఫొటో పంపించాక అవతలి వ్యక్తి చూడగానే వెంటనే అదృశ్యమవుతాయి. అదే వారు ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉంటే వాళ్లు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో ప్రాంతంతో సహా తెలుసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, క్విజ్, గేమ్స్ తదితర ఆకర్షణీయ ఫీచర్లు ఎన్నో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు ఇందులోని ఫీచర్లకు ఆకర్షితులై యువత ఎక్కువగా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో మోసగాళ్లు కూడా నేరాలకు ఆసరాగా మార్చుకుంటున్నారు.
సోషల్ మీడియాలో సంప్రదింపులు : లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాల షేరింగ్, డ్రగ్స్ విక్రయాలు, సైబర్ నేరాలు తదితర అనేక అసాంఘిక కార్యకలాపాల కోసం స్నాప్‌చాట్‌ను వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇటీవల డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాల్ని వినియోగిస్తున్న కళాశాల యువత పోలీసులకు దొరుకుతున్నారు. వారంతా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా గ్రూపుల్లో సంభాషణలు జరిపి, కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై నిఘా పెంచిన పోలీసులు, డ్రగ్స్ సరఫరాదారుల్ని కటకటాల్లోకి నెట్టేస్తున్నారని గుర్తించిన నేరగాళ్లు స్నాప్‌చాట్‌వైపు మళ్లుతున్నారు.
సైబర్, సెక్స్టార్షన్ వంటి నేరాల్లో అవతలి వ్యక్తుల సమాచారం బాధితులు తెలుసుకోలేరు. గుర్తుతెలియని నెంబర్ల నుంచి వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు పంపించి వేధిస్తుంటారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు స్నాప్‌చాట్ యూజర్ డేటా లాగటంలో ఆలస్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఫలానా యూజర్ ఐడీ వినియోగిస్తున్న వ్యక్తి డేటా కావాలని యాప్ నోడల్ అధికారుల్ని కోరినప్పుడు స్పందన ఆలస్యంగా ఉంటోందని తెలిపారు. దీనివల్ల దర్యాప్తు ఆలస్యంతో పాటు ఈలోపు నేరగాళ్లు తాము తప్పించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తునట్లు చెప్పారు.