Charminar Night Bazaar : హైదరాబాద్ పాతబస్తీలో పవిత్ర రంజాన్ మాసం సందడి కొనసాగుతోంది. రోజంతా కఠిన ఉపవాస దీక్ష చేసే ముస్లింలు, సాయంత్రం వేళల్లో షాపింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. చార్మినార్(Charminar) సమీపంలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న రాత్రి బజార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక్కడ వస్తువులు కొనుగోలు చేసేందుకు నగరం నుంచే కాకుండా, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో చార్మినార్ పరిసర ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.
రంజాన్(ramadan 2024) మాసంలో ముస్లింల ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్ధనలు, భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. రంజాన్ అంటే నోరూరించే ఆహారం మాత్రమే కాదు. షాపింగ్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, హాలీమ్ ఇవి మాత్రమే కాకుండా రంజాన్ మాసంలో చార్మినార్ చుట్టు పక్కల జరిగే రాత్రి బజార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. నిజాం కాలం నుంచి చార్మినార్ దగ్గర దోరికే గాజులకు మంచి డిమాండ్ ఉంది.
RAMADAN CELEBRATIONS IN HYD 2024 : రాత్రి బజార్‌లో దొరికే వివిధ వస్తువుల కోసం నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కావాల్సిన ప్రతి వస్తువు రాత్రి బజార్‌లో అందుబాటులో ఉందని, ధరలు కూడా సామాన్యులకు దగ్గట్టుగా ఉన్నాయని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసమంతా ఈ రాత్రి బజార్‌లో తెల్లవారుజామున వరకు దుకాణాలు తెరిచే ఉంటాయి.
మదీనా నుంచి చార్మినార్ వరకు ఉన్న దుకాణాలన్ని కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా దొరికే గాజులు మగువలను అకట్టుకుంటున్నాయి. హిందు, ముస్లిం అని తేడా లేకుండా పేద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేకంగా రంజాన్ మాసంలోనే దొరికే పత్తర్కాఘోష్ , హాలీమ్‌తో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను వ్యాపారస్థులు తయారు చేస్తున్నారు. కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని... జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయని వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది మొత్తంలో జరిగే విక్రయాలతో పోలిస్తే, ఒక్క రంజాన్ మాసంలోనే పాతబస్తీలోని రాత్రి బజార్‌లో రెట్టింపు అమ్మకాలు జరుగుతాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో షాపింగ్ చేయడానికి చార్మినార్ నైట్ బజారుకు వస్తాము. ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారీ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. - పర్యాటకుడు
హైదరాబాద్‌లో భానుడి భగభగ - ఎండ దెబ్బకు రంజాన్ మాసంలోనూ మార్కెట్లు వెలవెల - Ramadan Shopping