IT Employee Yalla Krishnaveni Success Story : నెల తిరిగేసరికి ఇంటి అద్దె కట్టడానికి నాన్న పడుతున్న కష్టాన్నీ.. ‘ఇద్దరమ్మాయిలే. ఎలా నెట్టుకొస్తామో ఈ జీవితాన్ని’. అని అమ్మ పడుతున్న ఆవేదనను కళ్లారా చూసింది. కోచింగ్ ఊసే లేకుండా నాలుగేళ్లపాటు రోజుకో గంట సాధన చేసి కోడింగ్‌పై పట్టు పెంచుకుంది. పే-పాల్ కంపెనీలో రూ.34 లక్షలకుపైగా వార్షిక వేతనానికి ఎంపికయింది. కన్నవాళ్ల కలల్నీ, ఇబ్బందుల్నీ తీర్చాలనుకుంటోంది. ఆమే హుజూరాబాద్‌కి చెందిన యాల్ల కృష్ణవేణి.
Karimnagar Young Woman Got Huge Salary Job : పేదింటి ఆడబిడ్డని అమ్మానాన్నల కష్టాలు చూస్తూ పెరిగానని ఇంజినీరింగ్ పూర్తయ్యేసరికి ఎలాగైనా మంచి ప్యాకేజీతో ఉద్యోగం అందుకోవాలన్నది నా లక్ష్యమని దాన్ని సాధించగలిగానని తెలిపింది. అయితే, ఈ విజయం అంత సులువుగా మాత్రం రాలేదని తెలిపింది. ఆమెది హనుమకొండ జిల్లా పెంచికల్‌పేట. తనకు ఊహ తెలిసేనాటికే అమ్మానాన్నలు ఉపాధి కోసం హుజూరాబాద్‌కు వచ్చేశారు. నాన్న సదిరెడ్డి ప్రైవేటు చిట్‌ఫండ్‌లో ఉద్యోగి. అమ్మ అంజలి గృహిణి. చెల్లె హరిప్రియ మెడిసిన్ చదువుతోంది. అమ్మానాన్నలు మాకోసం ఎంతో కష్టపడుతున్నారని చిన్నప్పుడే అర్థమైంది. ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే చదువు తప్ప మరో దారి లేదని భావించా. అందుకే, ఏ తరగతైనా నేనే ఫస్ట్. బీటెక్ హనుమకొండ సమీపంలోని ఎస్సార్ కళాశాలలో సీఎస్‌ఈలో చేరాను.
చదువుతో పాటు ఇతర నైపుణ్యాలపైనా పట్టు : ఓ పక్క ఇంజినీరింగ్ పూర్తయినా ఉద్యోగాలు దొరక్క ఇబ్బందిపడుతోన్న సీనియర్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తే, మరో పక్క ఇంటి అద్దె చెల్లించలేని నాన్న స్థితి కలవరపెట్టింది. దీంతో అందరికంటే భిన్నంగా చదివితేగానీ అనుకున్న లక్ష్యం చేరుకోలేనని అర్థమైంది. అందుకే, చదువుతో పాటు ఇతర నైపుణ్యాలపైనా పట్టు తెచ్చుకోవాలనుకున్నా. ఇందుకోసం రోజూ ఒక గంటపాటు కోడింగ్‌పై పట్టు పెంచుకోవడం ఆరంభించా. మధ్య మధ్యలో సినిమాలు, రీల్స్ వంటి వాటి గురించి స్నేహితులు చెప్పినా నాకు మాత్రం నా లక్ష్యమే గుర్తొచ్చేది. అవి చూస్తే కాసేపు ఆనందంగా అనిపించొచ్చు కానీ, నేను ఎంచుకున్న పంథాలో విజేతగా నిలిస్తే ఎప్పటికీ సంతోషమే నా వెంట ఉంటుందని నాకు నేను సర్దిచెప్పుకొనేదాన్ని.
రోజుకో గంట చదివితే రూ.34లక్షల జీతం : ఇలా బీటెక్ మొదటి ఏడాది నుంచి ఫైనల్ ఇయర్ వరకు రోజూ కచ్చితంగా ఫోన్, ల్యాప్‌టాప్‌లను కేవలం కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాల్ని నేర్చుకునేందుకే వాడా. తాజాగా వచ్చిన చాట్‌జీపీటీలో ప్రతిభ చూపించి మూడునెలల పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశం దక్కించుకున్నా. తరవాత జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో పే-పాల్ కంపెనీలో రూ.34.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యా. అంటే నెలకు సగటున 2.86లక్షల జీతాన్ని అందుకోబోతున్నా. నాన్న ఇప్పటికీ రూ.15 వేల కోసం పడుతున్న కష్టం చూసి నా శ్రమ ఫలించిందనే సంతోషం ఇప్పుడు మనస్ఫూర్తిగా కలుగుతుంది. ఎవరికైనా నేనొకటే చెబుతా ఎంత కష్టమైనా ఇష్టమైన దాని కోసం కష్టపడితే కచ్చితంగా విజయం సాధించగలమనడానికి నేనే ఓ ఉదాహరణ.