Huzurabad Govt Hospital Service In Telangana : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి 100 పడకలతో ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తోంది. మొత్తం 27 మంది వైద్యులకు ఏడుగురు డిప్యుటేషన్‌పై వెళ్లగా 20 మంది సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజు సుమారు 400 మంది రోగులు సేవల కోసం ఆసుపత్రికి వస్తున్నారు. అందులో 70 మంది రోగులు చికిత్సల కోసం చేరుతున్నారు. ప్రతి నెలా జనరల్ శస్త్ర చికిత్సలు, ఎముకల చికిత్సలు 60 నుంచి 70 వరకు అవుతున్నాయి. 150 నుంచి 200 మంది గర్భిణులకు ప్రసూతి సేవలందిస్తున్నారు.
రోగులకు నాణ్యమైన సేవలు : అందులో 50 వరకు సుఖప్రసవాలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో సేవలు, ఇతర నాణ్యతా ప్రమాణాలపై నోడల్ అధికారి నారాయణరెడ్డి, మేనేజర్ సాగర్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనలో ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్ సూచనలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందేలా చూస్తున్నారు. జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం బాహ్య అంచనా నివేదిక బృందం సభ్యులు నాజియా షాహీమ్, అలోక్ కుమార్ స్వైన్‌ల బృందం ఏప్రిల్ 14, 15న హుజూరాబాద్ ఆసుపత్రిని సందర్శించారు.
ఆసుపత్రికి ఎన్‌క్వాస్ గుర్తింపు : ప్రమాదాలు, అత్యవసర విభాగం, ఓపీ, చేరిన రోగులు, ప్రసూతి, పిల్లల వార్డు, శస్త్ర చికిత్సలు, ల్యాబ్, మందులు, సాధారణ పరిశీలన, ఇతర విభాగాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరును నమోదు చేసుకున్నారు. నివేదికలను భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సమర్పించారు. మొత్తం 100 మార్కులకి గాను ఆసుపత్రి 95 మార్కులు కైవసం చేసుకున్నట్లు జాతీయ రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ లేఖ పంపారు.
ఆసుపత్రికి ఎన్‌క్వాస్ గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రికి గతేడాది లక్ష్య అవార్డు రాగా ఈసంవత్సరం ఎన్‌క్వాస్ జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల గుర్తింపు లభించింది. ఆసుపత్రికి ధ్రువీకరణ పత్రంతోపాటు మూడేళ్ల పాటు ఏటా కేంద్రం 10 లక్షలు అందించనుంది. ఆ స్ఫూర్తితో కాయకల్ప అవార్డును సాధించేందుకు ముందుకు సాగుతామని వైద్యులు చెబుతున్నారు.
నక్షత్ర హాస్పిటల్లో కాలేయానికి సంబంధించి అరుదైన శస్త్ర చికిత్స - Liver Rare Surgery in Hospital