Husband Killed Wife in Hyderabad : ఎంతో అన్యోన్యంగా జీవించే ఆ జంట బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. రాగానే ఇక్కడ ఓ పనిలో కుదిరారు. ఇద్దరు పిల్లలను తమ సొంతూళ్లో వదిలేసి, నెలల పసికందును వెంట పెట్టుకుని భాగ్యనగరానికి వచ్చి నాలుగు రోజులైనా కాలేదు అప్పుడే ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భర్త భార్య తలపై ఇటుకరాయితో బాదడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. నెలల పసికందుతో పాటు మరో ఇద్దరు ఆడబిడ్డలు తల్లిలేని వారైపోయారు. ఈ ఘటన నగరంలోని కూకట్పల్లి సమీపంలోని ప్రగతినగర్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మహారాష్ట్రకు చెందిన రవీనా దూబే(26), నవీన్ దుర్వే దంపతులు ఈ నెల 26న భాగ్యనగరానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చారు. ప్రగతి నగర్లోని ఓ కళాశాల వసతి గృహం సమీపంలో గుడిసెలో తాత్కాలికంగా నివాసమున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలను సొంతూరులోనే ఉంచి ఏడాది వయసున్న బాబుతో హైదరాబాద్కు వచ్చారు. సోమవారం సాయంత్రం భార్యాభర్తలు బయటకు వెళ్లి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చారు.
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య - ప్రేమ వ్యవహారం నచ్చక కుమార్తెను కొట్టి చంపిన తల్లి
Husband Killed His Wife Delay Preparing Dinner in Telangana : ఇంటికి తిరిగి వచ్చిన తరవాత వంట త్వరగా చేయమని నవీన్ తన భార్యకు చెప్పాడు. కాసేపటి తరవాత మరికొంత తొందరపెట్టాడు. ఆమె కొంత ఆలస్యం చేసింది. ఈ విషయంపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త గుడిసె ఆవరణలో ఉన్న ఇటుక రాయిని తీసుకొని భార్య తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. రవీనా మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికులను ఆరా తీశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో ఉన్న వారి కుటుంబం, బంధువులకు సమాచారం అందించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.