People Carried Pregnant woman For Hospital in Cherla : కాలం మారిన.. ప్రభుత్వాలు మారిన.. ఎంత అభివృద్ధి చెందినా ఆ ప్రాంతంలో మాత్రం ఇంకా ఆ గ్రామస్థులకు అవస్థలు తప్పడంలేదు. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే వారు మూడు కిలోమీటర్లు నడవాల్సిందే మరి. రాష్ట్ర మారుమూల ప్రాంతం ఏజెన్సీలోని గ్రామానికి రోడ్డు మార్గం లేక అనారోగ్యం పాలైన ఓ ఏడు నెలల గర్భిణీని అత్యవసర పరిస్థితిలో మూడు కిలోమీటర్ల మేర జట్టిలో మోసుకెళ్లారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జరిగింది. చర్ల మండలంలోని రాళ్లపురం గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి కుంజం మాయేకు ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది.
దీంతో సమాచారం అందుకున్న ఏఎన్ఎం సిబ్బంది హుటాహుటిన అక్కడి వచ్చింది. కానీ అక్కడ ప్రథమ చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో 108కు సమాచారం ఇచ్చారు. తాళి పేరు ప్రాజెక్టు వద్ద నుంచి రాళ్లపురం గ్రామానికి చేరుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు రోడ్డు లేదు. దీంతో కాలినడకన నడవాల్సి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అంబులెన్స్ గ్రామానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో గర్భిణీ మాయేను తన భర్త పొజ్జయ్య, గ్రామస్థులు, వైద్య సిబ్బంది సాయంతో మంచాన్ని జట్టిగా మార్చి మూడు కిలోమీటర్లు మేర గ్రామ శివారు చెరువు వరకు మోసుకెళ్లారు.
రోడ్డు మార్గం లేక చాలామంది మృత్యువాత : గ్రామ శివారు వరకు చేరుకున్న అంబులెన్స్‌లో గర్భిణీకి ప్రాథమిక వైద్యం చేసి సత్యనారాయణపురం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత రెండ్రోజుల నుంచి గర్భిణీ మాయే సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించి ఫిట్స్ వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక, సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రోడ్డు మార్గం లేక చాలామంది మృత్యువాత పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.