Married Woman Suicide Due to Family Harassment : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణం యాదవ్ బజారులో అత్తా, కోడలు మధ్య తలెత్తిన వివాదం చివరకు వివాహిత బలవన్మరణానికి దారి తీసింది. సంతానం కలగటం లేదనే వేధింపులతో భర్త, అత్త ఇద్దరూ కలిసి కొట్టారని మనస్తాపం చెందిన కోడలు బొమ్మోతు లక్ష్మి, ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. ఈ ఘటన గురువారం పట్టణంలోని యాదవ బజారులో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం, బొమ్మోతు నరేశ్‌తో పాలకీడు మండలం రావిపహాడ్ గ్రామానికి చెందిన లక్ష్మికి 6 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. నరేశ్ రైస్ మిల్లులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. లక్ష్మికి చాలా కాలంగా సంతానం కలగకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం కూడా భర్త, అత్త లక్ష్మితో గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె, ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు అత్తింటి మీద దాడికి దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.