Massive Loss Due to Floods In Telangana : భారీ వర్షాల కారణంగా పెళ్లి జరిగిన కుటుంబాలు, జరగాల్సిన కుటుంబాలు కకావికలం అయ్యాయి. పెళ్లి కోసం తెచ్చుకున్న సామగ్రి, కట్న కానుకలు వరదలో కొట్టుకుపోయాయి. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు ఖమ్మం, పాలేరు, తిరుమలాయపాలెం, మహబూబాబాద్ ప్రాంతాల్లో వందల కుటుంబాలు వరద దుఃఖంలో మునిగిపోయాయి. వరద బీభత్సం జరిగి వారమైనా, ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు.
పెళ్లంటే సామాన్యమైన విషయం కాదు. పెళ్లికి కావాల్సిన వాటి గురించి రెండు నెలల ముందు నుంచే సిద్ధం చేసుకుంటారు. పప్పు, ఉప్పులు ముందుగానే ఏర్పాటు చేస్తారు. ఇలా మరో 15 రోజుల్లో సుముహూర్తం పెట్టుకోవాలనుకున్న వారి ఆశలకు భారీ వర్షాలు గండికొట్టాయి. ఖమ్మం మంచికంటి నగర్‌కు చెందిన రవికుమార్ వివాహం ఆగస్టు 30వ తేదీన జరిగింది. ఈ నెల 1న బంధుమిత్రులకు విందు ఇవ్వాల్సి ఉంది. రూ.3 లక్షల విలువైన బట్టలు, ఇతర సామగ్రి, నాలుగు క్వింటాళ్ల బియ్యం, నూనె డబ్బాలు, కిరాణా సరకులు సిద్ధం చేసుకుని నిద్రపోయారు. అర్ధరాత్రి ముంచుకొచ్చిన మున్నేరు వరదతో అవన్నీ కొట్టుకుపోయాయి.
పెళ్లికి అన్ని సిద్ధం చేసుకోగా పూర్తిగా ధ్వంసం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాకు చెందిన చాప్లా, నీల దంపతులు వారి కుమార్తె పెళ్లి ఈ నెలలో చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీనికోసం మంచం, ఫ్రిడ్జ్, కూలర్, రెండున్నర తులాల చెవి దిద్దులు, 20 తులాల పట్టీలు ఇలా అన్నీ దాదాపు రూ.5 లక్షలతో కొన్నారు. ఇంటిని చక్కబెట్టుకున్నారు. ఇంతలో వరద రావడంతో వారి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బియ్యం తడిసిపోయాయి. దీనికితోడు రెండు ఎకరాల విస్తీర్ణంలో వరి, మిరప పంటలు కొట్టుకుపోయాయి. పొలంలో ఐదు అడుగుల మేర ఇసుక మేటలు వేశాయి. తమ జీవనం సాగేదెలా అనుకుంటూ ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్నేరులో మునిగి : ఖమ్మంలో గత నెలాఖరున వివాహం జరిగిన మూడో రోజే వరుడి బాబాయి వెంకటేశ్వర్లు, పిన్ని సుజాత గృహం వరదల్లో మునిగిపోయింది. రూ.వేలు పోసి కొన్న పట్టుచీరలు, బట్టలు బురదతో పనికిరాకుండా పోయాయి. వరద కారణంగా నగలు నట్రా బురదలో మునిగి ఆచూకీ లేకుండా పోయాయి.
తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాకు చెందిన రాంబాబు పెళ్లై తెల్లారిందో లేదో వరద బీభత్సం సృష్టించింది. ప్రహరీ, ఇంటి సామగ్రి పూర్తిగా కొట్టుకుపోయాయి. కుటుంబం ఇంటిని వదిలి వేరే చోటికి తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఖమ్మం నగరంలో వెంకటేశ్వర నగర్, పెద్ద తండా, జలగం నగర్, తిరుమలాయపాలెం, పాలేరు మండలాల్లోనూ పలు గ్రామాల్లో పెళ్లి కుటుంబాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఖమ్మం రాకాసి తండాకు చెందిన భూక్యా సూక్యా, నాగమణి దంపతులు కూడా తమ కుమార్తె పెళ్లి ఈ నెలలోనే నిశ్చయించారు. వంట సామగ్రి, ఫ్రిడ్జ్, రెండు తులాల గొలుసు, 8 తులాల పట్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆకేరు ఉద్ధృతికి అవన్నీ కొట్టుకుపోయాయి. రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని కుటుంబసభ్యులు వాపోయారు.