Huge Demand For Rooftop Solar In Telangana : రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగదారులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. ముఖ్యంగా గృహ వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఇటీవల కేంద్రం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అందుబాటులోకి తీసుకురావడంతో ఒక్కసారిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Rooftop Solar Scheme In Telangana : 30 శాతానికి పైగా దరఖాస్తులు పెరిగిపోయినట్లు సోలార్ ఎనర్జీ ఇంటిగ్రేటర్స్ పేర్కొంటున్నారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే సుమారు 25 ఏళ్ల వరకు సోలార్ విద్యుత్‌ను వినియోగించుకునే వెసులుబాటు ఉండటంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. సూర్యఘర్ పథకానికి ముందు సౌర విద్యుత్ కోసం నెలకు వందకు మించి దరఖాస్తులు వచ్చేవి కావని ఇప్పుడు ఏకంగా మూడు వేల దరఖాస్తులు వచ్చాయని ఇంటిగ్రేటర్లు పేర్కొంటున్నారు.
"పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సోలార్ విద్యుత్‌పై ప్రజల్లో అవగాహన వచ్చింది. దీంతో చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొందరు నాసిరకం ఇంటిగ్రేటర్స్ మార్కెట్‌లోకి ప్రవేశించి వినియోగదారుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. సోలార్ విద్యుత్‌పై ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి." - అశోక్, సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు
300 యూనిట్ల ఫ్రీ కరెంట్- ఏటా రూ.18 వేలు ఆదా- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా!
PM Surya Ghar Muft Bijli Yojana : రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు సౌర విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. సోలార్ విద్యుత్‌ను రెడ్కో ఆధ్వర్యంలో రెండు దశల్లో ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్‌కు గత రాయితీతో పోలిస్తే సూర్యఘర్ పథకంతో రెండింతల రాయితీ లభిస్తోందని సోలార్ ఎనర్జీ ఇంటిగ్రేటర్స్ చెబుతున్నారు. ఈ పథకంతో ఒక కిలోవాట్‌కు రూ. 30వేలు, 2 కిలోవాట్లకు రూ. 60వేలు, 3కిలోవాట్ల నుంచి 10కిలోవాట్ల వరకు రూ. 78వేల రాయితీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. కొందరు నాసిరకం ఇంటిగ్రేటర్స్ మార్కెట్‌లోకి ప్రవేశించి వినియోగదారుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని తెలంగాణ సోలార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష : సోలార్ వినియోగదారులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సోలార్ అనుబంధ పరికరాలు, మ్యాడ్యూల్స్, ఇతరత్ర పరికరాల కొరత ఏర్పడుతోంది. డిమాండ్‌కు తగ్గట్లు సప్లయ్ లేక వినియోగదారులకు సకాలంలో సోలార్‌ను ఏర్పాటు చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోలార్ విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. రెడ్కో ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సోలార్ విద్యుత్‌ను పెద్దమొత్తంలో వినియోగంలోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. గృహ, కమర్షియల్ ఆఫీసు భవనాలపై సోలార్ సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.