Huge Crowd at Tourist Places in Hyderabad : వేసవి వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ విహార యాత్రలకు వెళ్లాలనుకుంటారు. విద్యార్థులందరికీ వేసవిలో సెలవులు దొరకటంతో నగరంలో ప్రముఖ ప్రదేశాలన్నీ తిరగాలనుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా సెలవులు దొరికితే నగరం బాట పడుతుంటారు. నగర వాసులయితే ఎక్కువగా వారాంతాల్లో సిటీలో చక్కర్లు కొడుతుంటారు. ఈసారి వేసవి ప్రారంభం నుంచి ఎండలు ఎక్కువ ఉండటంతో చాలా మంది బయటకు రాలేకపోయారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో ప్రజలు పర్యాటక ప్రాంతాల బాట పట్టారు.
విద్యార్థులు వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తుంటారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత, వేసవి సెలవులే వారికి కాస్త ఆటవిడుపుగా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలి, పిల్లలకు ఏమేం చూయించాలి అని ప్రణాళికలు వేసుకుంటుంటారు. అయితే ఈ ఏడాది ఎండల వల్ల బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ప్రస్తుతం వానలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడి ఎగ్జిబిషన్లు, వాటర్ పార్క్‌లకు గిరాకీ పెరిగింది.
వేసవి సెలవుల్లోనే ఎంజాయ్ చేయాలని : నగరంలో ప్రత్యేకంగా నెక్లెస్ రోడ్ ప్రాంతంలోని జల విహార్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను సందర్శించడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లను సందర్శిస్తున్నారు. వేసవి సెలవుల్లోనే ఎంజాయ్ చేయాలి అందుకే వాటర్ స్పోర్ట్స్క్, పార్కులకు వెళుతున్నామని పిల్లలు, వారి తల్లిదండ్రులు అంటున్నారు. వేసవి నుంచి కాస్త ఊరట లభించటంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సైతం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను సందర్శించి ఉత్సాహంగా గడుపుతున్నారు.
'పిల్లలకు స్కూల్ హాలిడేస్ అని జల విహార్‌కు వచ్చాం. ప్రతి సంవత్సరం పిల్లలతో కలిసి వస్తాం. సమ్మర్లో స్విమ్మింగ్ చేస్తుంటే హ్యాపీగా ఉంది. జల విహార్‌లో చాలా ఉన్నాయి. ఎంజాయ్ చేశాం. హుస్సేన్ సాగర్‌కు వెళ్లాం. సిటీలో ఉన్న ఎగ్జిబిషన్‌కు వెళ్తున్నాం'- పర్యాటకులు