How to Use T-SAFE App : కోల్‌కతాలో పని ప్రదేశంలో వైద్యురాలిపై హత్యాచార ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. ప్రతి రాష్ట్రంలో నిరసన సెగలు రాజుకున్నాయి. మహిళాభద్రతకై ప్రభుత్వాల ప్రత్యేక చర్యలు, ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో టీ సేఫ్(TSAFE) పేరు వార్తల్లోకి వచ్చింది. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం బయటికొచ్చిన మహిళలకు సురక్షితంగా గమ్యస్థానాలు చేరేవరకు పోలీసు నిఘా ఉంటే ఈ యాప్ గురించి సర్వత్రా చర్చనడుస్తోంది.
టీ సేఫ్ యాప్‌ను ప్రతి ఒక్క మహిళ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్, పోలీసు శాఖ సంయుక్తంగా టీ సేఫ్ యాప్‌ను 2024 మార్చిలో రూపొందించారు. దీని ద్వారా మహిళలు, విద్యార్థినులకు ప్రయాణ సమయంలో ఆకతాయిలు నుంచి ఏమైనా ఇబ్బంది తలెత్తితే తక్షణం పోలీసు రక్షణ లభిస్తుంది. ఇది దేశంలోనే మొదటి ట్రావెల్ మానిటరింగ్ సేవ అని చెప్పవచ్చు. ఈ యాప్ ప్రయాణ సమయంలో ప్రతి స్టెప్‌ను కనిపెడుతూ మానిటర్ చేస్తూ ఉంటుంది.
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి :
- ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
- దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- లాగిన్ అవ్వగానే మానిటరింగ్, డయల్ 100 ఆప్షన్ కనిపిస్తుంటుంది.
- మనం మానిటరింగ్ నొక్కగానే మనం చేరుకోవాల్సిన ప్రదేశం, ఎందులో వెళ్తున్నామో ఆ వాహనం నంబర్ ఎంటర్ చేయగానే మానిటరింగ్ స్టార్ట్ అవుతుంది.
- ఏదైనా ఆపద అనిపిస్తే డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు అలర్ట్ అయి మన లోకేషన్ ఆధారంగా సంబంధిత స్టేషన్‌కు మన వివరాలు వెళతాయి.
- దీనిపై ఐదు నిమిషాల్లోనే పోలీసులు స్పందిస్తారు. మన నంబర్‌కు ఫోన్ వస్తుంది.
- ఒకవేళ స్పందించకపోతే నేరుగా లోకేషన్‌కు వచ్చేస్తారు.
- యాప్‌లోనే కాదు వెబ్ సైట్లోనూ దీని సేవలను పొందవచ్చు.
ప్రతి 15 నిమిషాలకు ఆటోమెటిక్ సేఫ్టీ మెసేజ్ : తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ యాప్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతోంది. ప్రయాణం ప్రారంభించే ముందు వివరాలను నమోదు చేసి మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే చాలు ఎలాంటి భయం లేకుండా మన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవచ్చు. ప్రయాణం ప్రారంభించే ముందు డయల్ 100కు డయల్ చేసి ఐవీఆర్ ద్వారా 8నంబర్‌ను క్లిక్ చేసి వివరాలను తెలియజేస్తే సెల్ టవర్ ఆధారంగా లోకేషన్‌ను గుర్తిస్తారు. కేవలం మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే అయిపోదు. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ప్రతి 15 నిమిషాలకు ఫోన్‌ను ఆటోమెటిక్ సేఫ్టీ మెసెజ్ వస్తుంది. దానికి నాలుగంకెల పాస్ కోడ్ పంపిస్తే మనం సురక్షితం గా ఉన్నామని పోలీసులు ధ్రువీకరిస్తారు. లేదంటే లోకేషన్ ఆధారంగా పోలీసులు మన లోకేషన్‌కు వచ్చేస్తారు.
డయల్ 100కు మెసేజ్ వెళుతుంది : ప్రయాణ సమయంలో వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే మార్గంలో వెళ్లినా, సరిహద్దులు దాటి వెళ్లినా, ఎక్కువ సేపు ఆగినా టీ సేఫ్ కంట్రోల్ రూం నుంచి మన లోకేషన్ ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు 100 డయల్ చేస్తారు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారు. కాల్ వస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 790 పెట్రోలింగ్ కార్లు, 1085 బ్లూకోల్ట్ వెహికల్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు ఈ యాప్‌ను 10 వేల మంది మహిళలు డౌన్ లోడ్ చేసుకున్నారు. 17,263 ట్రిప్పులను పోలీసులు ట్రాక్ చేశారు. యాప్ ప్రమోషన్ కోసం రూపొందించిన లఘుచిత్రం ‘బెస్ట్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ క్యాంపెయిన్’ విభాగంలో ‘ఫ్రంట్ బెంచర్స్ 2024 - డిజిటల్ మార్కెటింగ్ ఎక్సలెన్స్’ పురస్కారాన్ని గెలుచుకుంది.
మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ - ఇక ఆకతాయిల వేధింపులకు చెక్ - T SAFE App For Women Safety