How to Count EVM Votes in Elections : తెలుగు రాష్ట్రాల పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఓట్ల లెక్కింపులో ప్రతీ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న చిన్న అంశాలను సైతం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ అవుతుంది. కానీ దీని కోసం ముందు నుంచే కసరత్తు జరుగుతుంది. లెక్కింపునకు 4 గంటలకు ముందు అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతారు.
సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం 4 గంటలకు వెళ్లాలి. 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని వారితో ప్రమాణం చేయించి కాగితాలపై సంతకాలు కూడా చేయిస్తారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మెుదలవుతుంది. మొదట ఉదయం 8గంటల నుంచి 8.30వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అప్పటికీ లెక్కింపు కాకపోతే అయ్యే వరకూ కంటిన్యూ చేస్తారు. ఒకవేళ పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభిస్తారు. ఒక నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కిస్తారని అంచనా.
రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ - ఓటింగ్ శాతం ఎంతంటే? - TS LOk sabha Polls 2024 Ended
రౌండ్స్ లెక్కేంటంటే?
నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను, వాటి పరిధిలో పోలైన ఓట్లు ప్రాతిపదికన ఎన్ని రౌండ్‌లు లెక్కించాలో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అసెంబ్లీ ఓట్లును 14 నుంచి 15 టేబుళ్లపై లెక్కింపు చేస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎం(EVM)ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్‌గా రికార్డు చేస్తారు. ఒక రౌండ్‌లో ఒక టేబుల్‌కు 1000 నుంచి 1200 ఓట్లు మాత్రమే లెక్కిస్తారు. ఈవీఎంలను కూడా అలానే పంపిణీ చేస్తారు.
వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కిస్తారా?
ప్రజల్లో ఓటింగ్ పట్ల విశ్వాసాన్ని పెంచడానికి 2013లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) సిస్టమ్‌ను ఈవీఎంలకు అనుసంధానించారు. VVPAT సిస్టమ్ అభ్యర్థి పేరు, ఎన్నికల చిహ్నాన్ని కలిగి ఉన్న ప్రింటెడ్ పేపర్ స్లిప్ ఉంటుంది. EVMల లెక్కింపు పూర్తైన తర్వాత కొన్ని వీవీప్యాట్‌లోని స్లిప్పులను మాత్రమే లెక్కిస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నంబర్స్‌ను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. ఇలా లాటరీ తీసినప్పుడు వచ్చిన వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించి EVMలతో సరిపోల్చుతారు.
ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఓట్లు VVPATల స్లిప్‌ల ఓట్లను సరి చూసి ఏదైనా వ్యత్యాసం ఉంటే మళ్లీ స్లిప్పులను రెండోసారి లెక్కపెడతారు. ఇలా మూడుసార్లు చేస్తారు. అప్పటికీ తేడా వస్తే స్లిప్పులలోని లెక్కనే పరిగణనలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈవీఎంల లెక్కింపుతో అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తోంది. కానీ వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యే దాకా అధికారికంగా ప్రకటించరు.
India General Elections 2024 : ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాలంటే 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. రౌండ్ పూర్తైన వెంటనే అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. మైక్రో అబ్జార్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు చేయాలి. ఆ తర్వాత ఏవైనా EVMలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు ఫలితాల రికార్డులతో పరిశీలిస్తారు. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోవాలి. ఆ తర్వాత ఏజెంట్లు ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పిన తర్వాతే RO రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యం అవుతుంది.
ఓట్ల లెక్కింపు ఇలా :
- ఒకో EVMలో వెయ్యి నుంచి 1200 ఓటు ఉంటాయి.
- రౌండ్ కి 14టేబుల్స్ వేస్తే ఆ రౌండ్‌లో 14,000 నుంచి 15,000 ఓట్లు లెక్కిస్తారు.
- లక్ష ఓటర్లు ఉంటే 8 నుంచి 10 రౌండ్లలో ఫలితం వస్తుంది.
- రెండు లక్షలు ఉంటే 16లేదా 20 రౌండ్లలో ఫలితం వెలువడుతుంది.
- ఏపీలోని భీమిలి, గాజువాక లాంటి మూడు లక్షల ఓట్లు ఓటర్లు ఉన్న చోట 24 రౌండ్లు ఉండచ్చు.
లెక్కింపు బాధ్యత ఎవరిది?
ఒక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ మొత్తం రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటనలో ఆర్వోదే తుది నిర్ణయం. రిటర్నింగ్ అధికారి ప్రభుత్వ అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రతి నియోజకవర్గానికి భారత ఎన్నికల సంఘం చేత నామినేట్ చేయబడిన స్థానిక అధికారి అయి ఉంటారు.
కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది?
పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్లను లెక్కించే స్థలాన్ని రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. కౌంటింగ్ తేదీ, సమయం కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఆదర్శవంతంగా ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును ఒకే చోట చేయాలి. ప్రాధాన్యంగా ఆ నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి ప్రధాన కార్యాలయంలో చేయాలి. ఇది రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సరాసరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ పరిస్థితిలో రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఒకే చోట కానీ, వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు జరుగుతుంది.
'ఎక్కువ సీట్లు వచ్చేవి మాకే' - గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా - Leaders Prediction on Elections