Holiday for Educational Institutions in Adilabad District : అదో అడవి బిడ్డ ఘీంకార స్వరం, నిజాం సాయుద బలగాలకు వ్యతిరేకంగా పోరుకోసం పూరించిన పాంచజన్యం. ఆదివాసీల స్వయం ప్రతిపత్తే ద్యేయంగా ఎగిసిన ఉద్యమ బావుట. దేశానికి స్వాతంత్రం రాకముందే జల, జంగల్, జమీన్ నినాధంతో రణక్షేత్రంలో ఎగిసిన ఆ పతాకమే.. కుమురంభీం. ఎనిమిదిన్నర దశాబ్ధాల కిందట ప్రారంభమైన ఆ రణనినాధం, ఇప్పటికీ ప్రతిద్వనిస్తూనే ఉంది. కుమురంభీం 84వర్థంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో గురువారం (17-10-2024) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రేపు సెలవు ప్రకటించినందుకు బదులుగా నవంబర్ 9 రెండో శనివారం పనిదినం ఉంటుంది. ఈ మేరకు ఇన్‌ఛార్జి కలెక్టర్ వెంకటేశ్ ఆదేశాలు జారీచేశారు.
విప్లవవీరుడు కుమురం భీం వర్ధంతి సందర్భంగా జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ సంఘాలు భీం వర్ధంతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న పలువురు నేతలు రేపటి వర్ధంతి సందర్భంగా తమ భవిష్యత్ ప్రణాళిక ప్రకటించనున్నారు. తెలంగాణ విముక్తి కోసం నిజాంల రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసీ పోరాట యోధుడు కుమురం భీం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇతను ఆదిలాబాద్ అడవుల్లో గోండు కుటుంబంలో జన్మించాడు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలోని సంకెపల్లి గ్రామంలో జన్మించి, చిన్నప్పుడే తల్లీతండ్రులను కోల్పోయి బాబాయ దగ్గర పెరిగాడు.
అణచివేతపై తిరగబడిన ఘీంకారస్వరం : అడవినే నమ్ముకున్న తమపై నిజాం సైనికుల అకృత్యాలను నిరసిస్తూ తుపాకీ అందుకున్నాడు. జల్-జమీన్-జంగిల్ నినాదంతో ఆదివాసీలను ఏకం చేసి నిజాం పాలకులపై పోరాటం ప్రారంభించాడు. ఆదివాసీలకు స్వయం పాలన కోసం డిమాండ్ చేసిన భీం చివరకు 1940లో ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న సమయంలో ఓ కోవర్ట్ కుట్రకు బలయ్యాడు.
అశ్వయుజ పౌర్ణమి రోజున జోడేఘాట్ గుహల్లో నిద్రిస్తుండగా ఓ కోవర్ట్ ఇచ్చిన సమాచారం మేరకు నిజాం సైన్యం జరిపిన కాల్పుల్లో భీం అసువులు బాశాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అశ్వయుజ పౌర్ణమి రోజున భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగానే రేపు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.