History of Tirumala Laddu: "అదివో అల్లదివో శ్రీహరివాసము.. పదివేల శేషుల పడగలమయము".. అంటూ శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు సాక్షాత్తూ శ్రీవైకుంఠనాథుడిని తలచుకుంటారు. సంవత్సరంలో 365 రోజులు ఉంటే 400కు పైగా పండగలు తిరుమలలో జరుగుతుంటాయి. ఇక తిరుమల అంటే స్వామి దర్శనం తర్వాత గుర్తుకువచ్చేది లడ్డూ ప్రసాదం. ఆ లడ్డూ ఎన్నిసార్లు తిన్నా మళ్లీ మళ్లీ తినాలపిస్తుంది. కారణం.. ఇవి అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే. అందుకే తిరుమల వచ్చిన భక్తులు వీలైనన్ని లడ్డూలను కొనుగోలు చేసి బంధువులు, స్నేహితులకు పంచి పెడుతుంటారు. మరి.. ఈ లడ్డూ స్వామివారి ప్రసాదంగా ఎప్పట్నుంచి అందిస్తున్నారు? పేటెంట్ వివరాలేంటి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మొదట్లో పల్లవ ప్రసాదం: క్రీ.శ. 614లో పల్లవరాణి సమవాయి.. భోగశ్రీనివాసమూర్తిని తిరుమల ఆలయానికి కానుకగా సమర్పించుకుంది. ఈ విగ్రహం పంచబేరాల్లో ఒకటిగా ఉంది. పల్లవుల కాలంలోనే భగవంతునికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు. అప్పట్లో తిరుమలకు చేరుకునేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అయితే శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో తిరుమల ప్రాశస్త్యం పెరిగింది.
ప్రసాదానికి గ్రామాల విరాళం: ఆ తర్వాత స్వామివారికి నివేదించే నైవేద్యానికి రెండవ దేవరాయల కాలంలో అమాత్య శేఖర మల్లన్న మూడు గ్రామాలను సమర్పించారు. ఆ గ్రామాలపై వచ్చే ఆదాయంతో నిత్యం సేవలు నిర్వహించేవారు. మల్లన్న కాలంలోనే శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో సమయ పట్టిక తయారుచేశారు. భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. ఆ తర్వాత కాలంలో మనోహరపడి, సుక్కీయం, అప్పం.. వంటి తదితర వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించేవారు. విజయనగర రాజుల కాలంలో అవసరం అనే ప్రసాదాన్ని ఇచ్చేవారని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.
మూడు వందల ఏళ్ల క్రితమే తీపి ప్రసాదం: మూడు వందల ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది. 1803లో బ్రిటిషువారు.. ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ వుండేవి. అనంతరం మహంతుల హయాములో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలానికి లడ్డూగా మారింది.
కల్యాణం అయ్యంగార్: 1940ల్లో మిరాశీదార్లలో ఒకరైన కల్యాణం అయ్యంగార్ లడ్డూ ప్రసాదం ఇవ్వడాన్ని ప్రారంభించారు. ఈ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది. తిరుమల అంటే లడ్డూ ప్రసాదం.. లడ్డూ ప్రసాదం అంటే తిరుమల అనేంతగా పేరు వచ్చింది.
మూడు రకాల లడ్డూలు: సాధారణంగా మనకు తెలిసిన తిరుమల లడ్డూలూ రెండు మాత్రమే. భక్తులకు దర్శనంతోపాటు ఇచ్చేది. అదనంగా కావాలంటే రూ.50 పెట్టి కొనుగోలు చేసేది. ఇది కాకుండా, రెండో రకాన్ని కల్యాణోత్సవం లడ్డూ అంటారు. దీని ధర రూ.200. ఇవే కాకుండా ఆస్థానం లడ్డూ అని మరొకటి ఉంటుంది. ప్రత్యేక పండగ సమయాల్లో, రాష్ట్రపతి లాంటి ముఖ్య అతిథులు వచ్చిన సమయాల్లో వీటిని తయారుచేస్తారు. బరువు 750 గ్రాములు ఉంటుంది.
అన్నీ పక్కా కొలతల ప్రకారమే: లడ్డూ తయారీకి ఉపయోగించే పదార్థాలను కొలతల ప్రకారమే వినియోగిస్తారు. దీనికి ప్రత్యేకంగా దిట్టం ఉంటుంది. ఒక ప్రోక్తం అంటే 51 లడ్డూలు. తయారీలో శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండుద్రాక్ష... తదితర పదార్థాలు వినియోగించి లడ్డూలను కొలతల ప్రకారం తయారు చేస్తారు.
పేటెంట్ ఉంది: ఈ తిరుపతి లడ్డూకు పేటెంట్ ఉంది. 2009లో జీఐ (భౌగోళిక గుర్తింపు) లభించింది. కాబట్టి.. టీటీడీ అనుమతి లేకుండా ఈ లడ్డూను మరెవరూ తయారు చేయకూడదు.
ఎందుకంత రుచి: తిరుమల కొండల్లో ప్రవహించే నీరు, వాతావరణం, ఆలయంలోపోటు... అన్నీ కలిసి స్వామివారి ప్రసాదాన్ని విశిష్టంగా నిలుపుతున్నాయి.
తిరుమల శ్రీవారి లడ్డూకే ఎందుకంత రుచి? - ఇలా తయారు చేస్తారు కాబట్టే ఆ స్పెషల్ టేస్ట్
శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక - మారిన తిరుమల లడ్డూ రూల్స్! మీకు తెలుసా?