High Security For EX CM Jagan : సాధారణంగా వీఐపీలకు భద్రతా సిబ్బంది అంటే 100 మందికి మించి ఉండరు. కానీ ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యుల భద్రతలో ఎంత మంది ఉంటారో తెలుసా? అక్షరాలా 986 మంది. అంటే ఓ చిన్న గ్రామ జనాభాతో సమానం. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర భద్రత కలిపినా ఈ సంఖ్య చేరడం కష్టమే. అంతే కాదు జగన్ కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడకంచె బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు.
AP EX CM Jagan Security Expenditure : దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జడ్ ప్లస్ కేటగిరీలో ఉండే వారి ఇళ్ల వద్ద కూడా ఈ స్థాయి భద్రత ఉండదేమో! తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే 934 మంది ఆయన రక్షణలో నిమగ్నమై ఉంటారు. మూడు షిప్టుల్లో చూస్తే ఏక కాలంలో 310 మంది పైనే ఇదంతా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే. అదే బయటకు అడుగు పెడితే భద్రతా సిబ్బంది సంఖ్య రెండు, మూడింతలు పెరుగుతుంది. వీరికి ఒక్కొక్కరికి నెలకు సగటున రూ.50వేల లెక్కన చూసినా ఐదేళ్లలో చెల్లించిందెంతో తెలుసా రూ.296 కోట్లుపైనే. వీరంతా కిలోమీటర్ల పొడవునా చెట్లు కొట్టేస్తారు. పరదాలు కట్టేస్తారు. దుకాణాలు మూయిస్తారు. రాకపోకలు నిలిపేస్తారు. జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్లు, ఆ మార్గంలో ప్రయాణించే వారైతే అయిదేళ్లుగా నరకమే చూస్తున్నారు. తమ ఇంటికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా గుర్తింపు కార్డులు మెడలో వేసుకుని తిరగాల్సిందే. అడుగడుగునా పోలీసులు ఆపుతుంటే వారికి సమాధానమిస్తూ రుజువులు చూపించాలి.
సొమ్ము ప్రజలది సోకు జగన్‌ది - తాడేపల్లి ప్యాలెస్ రోడ్డంతా ఆక్రమణే - Jagan occupy public propert
కిమ్‌ను తలదన్నేలా జగన్ : ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి భద్రత ఉండాల్సిందే. అందులో సందేహం లేదు. అయితే ఇంత భారీ స్థాయిలోనా అవసరానికి మించి ఉండాలా అనేదే అసలు ప్రశ్న. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. తీవ్రవాదుల ఆనవాళ్లు లేవు. జగన్‌కు వారి నుంచి అంత ముప్పు లేదు. కానీ ఈ ప్రత్యేక రక్షణ చట్టం ఎందుకు తెచ్చారో అంతు చిక్కడం లేదు. కిమ్‌ను తలదన్నేలా జగన్ వ్యవహరిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందో ఇప్పుడూ అదే కొనసాగుతోంది.
జగన్ సీఎం హోదాకు దూరమైనా అక్కడి ప్రజల ఇబ్బందులు మాత్రం తీరలేదు. వినతులు ఇవ్వగా ఇటీవల ప్యాలెస్ పక్క రోడ్డులో రాకపోకలకు అనుమతించారు. నిజానికి ఆయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్షనేత హోదా కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేని స్థాయిలో రక్షణ కల్పిస్తున్నారు. గతంలో ఉన్న భద్రత ఏ మాత్రం తగ్గించలేదు. జగన్ కాన్వాయ్‌లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉండగా జడ్ ప్లస్ కేటగిరిలో ఎన్ఎస్జీ ఆధీనంలో ఉన్న చంద్రబాబుకు బుల్లెట్‌ప్రూఫ్ ఫార్చూనర్ వాహనం మాత్రమే అందుబాటులో ఉంచారు.
Security to EX CM Jangan Family : దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో జగన్‌కు ప్రభుత్వం రక్షణ కల్పించింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 379 మంది ఎస్ఎస్జీ సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో ఉంటారు. వీరు కాకుండా 491 మంది ఇతర దళాలు, 116 మంది ఇతరత్రా విధులు నిర్వహిస్తుంటారు. రాష్ట్రపతి, ప్రధానికి మించిన స్థాయిలో ఆయన చుట్టూ పోలీసు వలయం ఏర్పాటైంది. ఆయనతో పాటు భారతికి నలుగురు, తల్లి విజయమ్మకు నలుగురు చొప్పున భద్రతా సిబ్బంది ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌తో పాటు లోటస్‌పాండ్, ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ల వద్ద కూడా 52 మంది పోలీసులు నిరంతరం జగన్ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంటారు. కుటుంబసభ్యులకు కూడా దేశ, విదేశాల్లో భద్రత కల్పించేలా జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంతగా ఉపయోగించుకున్న సీఎం దేశ చరిత్రలో మరెవరూ ఉండరేమో అనే సందేహం కలగక మానదు.
అడుగడుగునా చెక్‌పోస్టులే : తాడేపల్లిలో జగన్ భద్రత కోసం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ప్యాలెస్ చుట్టూ ఉన్న వాటితో పాటు ఉండవల్లి గుహలు, సీతానగరం, వారధి, ప్రకాశం బ్యారేజి, ప్రాతూరు సహా అడుగడుగునా చెక్‌పోస్టులే. ఒక్కో చోట 10 నుంచి 16 మంది కాపు కాస్తుంటారు. వీరు కాకుండా ట్రాఫిక్ విధుల్లో సుమారు 30 మంది వరకు ఉంటారు. సీఎం రక్షణలో నిమగ్నమయ్యే బాంబు స్క్వాడ్, యాంటి నక్సల్ స్క్వాడ్ బృందాలు అదనం. ఎస్ఎస్జీ బలగాలు కాకుండా ఇలా చెక్‌పోస్టులు, ఇతర బాధ్యతల్లో ఉండేవారు సుమారు 555 మంది ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి ఎస్పీ ర్యాంకు అధికారితో పాటు ఏపీఎస్పీ బెటాలియన్స్ నుంచి ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. మొత్తం 389 మంది భద్రతా సిబ్బందికి 50 శాతం అదనపు భత్యం చెల్లిస్తున్నారు. తాడేపల్లి పెట్రోలు బంక్ నుంచి భరతమాత విగ్రహం వరకు సర్వీస్‌రోడ్డులో పెద్దఎత్తున యూనిఫాంలో ఉండే సాయుధ పోలీసులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. రోజూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. రోడ్లను బ్లాక్ చేసి రాకపోకలు నిలిపేస్తుంటారు. అయిదేళ్లుగా అక్కడి ప్రజలు నిర్బంధంలోనే మగ్గుతున్నారు.
వ్యక్తిగత గోప్యతకూ భంగం కలిగేలా భద్రత : జగన్ రక్షణ పేరుతో డ్రోన్ పహారా నిత్యకృత్యంగా తయారైంది. ఆయన ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారి వ్యక్తిగత గోప్యతకూ భంగం వాటిల్లుతోంది. ఏ క్షణం ఏం చేస్తున్నారో అంటూ పోలీసులు డ్రోన్ల ద్వారా గమనిస్తుండటంతో సొంత ఇంట్లోనూ స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి. నివాస ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలు ఉన్నా జగన్ నివాసం దగ్గర మాత్రం అవన్నీ వర్తించవన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇలా ఎగరవేసిన డ్రోన్ ఒకటి నియంత్రణ కోల్పోయి కన్పించకుండా పోవడంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. అధికారంలో ఉండగా మాజీ సీఎం జగన్ మితిమీరిన భద్రత కల్పించుకున్నారంటూ కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సెక్యూరిటీ మాన్యువల్ ఉల్లంఘించి మరీ భారీ స్థాయిలో భద్రతను పెట్టుకున్నారని అభియోగాలు ఉన్నాయి. మాజీ సీఎం అయిన తర్వాత కూడా కాన్వాయ్‌లో, వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో మార్పు జరగలేదన్న విషయాలపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది.