High Court Orders for Pinnelli Ramakrishna Reddy Interim Anticipatory Bail Extension : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వరకు పొడిగించింది. గురువారం బెయిల్ పిటిషన్‌పై వేసవి సెలవుల బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. రాత్రి 10 కావడం, పూర్తి స్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరువైపు న్యాయవాదుల సమ్మతి మేరకు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ వాయిదా వేశారు.
ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టిన వ్యవహారంతోపాటు మరో రెండు హత్యాయత్నం కేసులు కూడా పిన్నెల్లిపై నమోదయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి ప్రాథమిక వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్‌పై గురువారమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పలేదని అన్నారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేనందున మరో రోజుకు వాయిదా వేయాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించకపోతే అర్ధరాత్రి అరెస్టు చేయడానికి పిటిషనర్ ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారని తెలిపారు.
ఏడేళ్లకు పైబడి శిక్ష? : ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని, పిటిషనర్‌పై నమోదైనవి తీవ్ర కేసులని టీడీపీ ఏజెంటు నంబూరి శేషగిరిరావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అవి అరెస్టు నుంచి ఉపశమనం కలిగించాల్సిన కేసులు కావని అన్నారు. పిన్నెల్లి, ఆయన అనుచరుల దాడిలో గాయపడిన కారంపూడి సీఐ నారాయణస్వామి తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. సీఐపై అత్యంత దారుణంగా దాడి చేశారని గుర్తు చేశారు. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్లలో కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు. పిటిషనర్‌పై నమోదు చేసిన 4 కేసులలో రెండు ఏడేళ్లకు పైబడి శిక్ష విధించేందుకు వీలున్నవేనని చెప్పారు.
మాచర్లలో ఆటవిక పాలనకు తెర- పిన్నెల్లి ఓటమితో ప్రజలకు స్వాతంత్య్రం! - Pinnelli defeat in Macherla
రాత్రి పదిన్నర వరకు తీవ్ర ఉత్కంఠ : పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారని రాత్రి పదిన్నర వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఉత్కంఠ వీడింది. గురువారం సాయంత్రం 5గంటల 15నిమిషాలకు ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం చేసి వెళ్లిపోయారు.