HC On Vasudeva Reddy Bail Petition: గుడివాడ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎస్‌బీసీఎల్) పూర్వ ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
బహిరంగ టెండర్ ద్వారా 2011లో సీతామహాలక్ష్మి అనే మహిళ ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు వాసుదేవరెడ్డి, అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయన అనుచరులు ప్రయత్నించారని సీతామహాలక్ష్మి కుమారుడు దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతటితో ఆగకుండా కొడాలి నాని అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. తమ గోడౌన్ లైసెన్స్ లీజు ఒప్పందం ముగియకుండానే బెదిరించి, బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. లిక్కర్ బాక్సులను పగలకొట్టి తగలబెట్టారన్నారు. దుర్భాషలాడారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నెలన్నరగా అజ్ఞాతంలో వాసుదేవరెడ్డి - చర్యలు ఎప్పుడు ? - Former APSBCL MD Absconded
ఈ వ్యవహారంపై అప్పటి జేసీ మాధవిలతారెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించారని వాపోయారు. మరోవైపు తమపైనే ఫిర్యాదు చేస్తావా అని, అప్పట్లో కొడాలి నాని అనుచరులు కొందరు తనకు ఫోన్లు చేసి బెదిరించారని ప్రభాకర్ పేర్కొన్నారు.
వాసుదేవరెడ్డి, కొడాలి నాని, కలెక్టర్ మాధవీలతారెడ్డితో పాటు మరికొందరు వైఎస్సార్సీపీకి చెందిన ముఖ్య నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఎందుకు పేర్కొన్నావంటూ, కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారన్నారని ప్రభాకర్ వాపోయారు. వారి నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గుడివాడ పోలీసులు వాసుదేవరెడ్డి, కొడాలి నాని, తదితరులపై ఈనెల 5న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతు వాసుదేవరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదు - Case Against on EX MLA Kodali Nani