High Court Hearing on Kantirana's Anticipatory Bail Petition : నటి కాదంబరీ జత్వానీ కేసులో ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా (Kanti Rana), ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని (Vishal Gunni) సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై ముంబయి నటి వ్యవహారంతోపాటు పలు అభియోగాలున్నాయి.
kanthi Rana Appeals Anticipatory Bail to High Court : ముంబయి నటిని వేధించిన కేసులో కేసులో ముందస్తు బెయిల్ కోసం అధికారి కాంతిరాణా తాతా పెట్టుకున్న పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో పూర్తి వివరాలు సమర్పించేందుకు స్వల్ప సమయం కావాలని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టును కోరారు. తక్షణమే పిటీషనర్ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే కుక్కల విద్యాసాగర్‌ని అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి రేపటి వరకు ఐపీఎస్ అధికారి కాంతిరాణా అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. మరోవైపు దర్యాప్తునకు సహరించాలని కాంతిరాణాకు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
ముంబయి నటి జెత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. దెహ్రాదూన్ నుంచి రైలులో అర్ధరాత్రి నగరానికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం పీఎస్ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తిచేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి న్యాయమూర్తి వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు. ఆ తర్వాత విద్యాసాగర్‌ను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. నేడు కోర్టులో విద్యాసాగర్‌ను హాజరుపరచనున్నారు. ముంబయి నటి కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీస్తున్నామన్నారు. జత్వానీకి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.