High Court on Harish Rao Petition : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు అంశంలో ఆయనను అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సహకరించాలని సూచించింది. ఆయనపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
హైకోర్టులో హరీశ్‌రావు క్వాష్ పిటిషన్ : పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో స్థిరాస్తి వ్యాపారి, కాంగ్రెస్ నేత జి.చక్రధర్ గౌడ్ రాజకీయ కక్షతోనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు బుధవారం (డిసెంబర్ 4) హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ తనతో పాటు రాధాకిషన్‌రావు తదితరులపై చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై పోలీసులు ప్రాథమికంగా విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
ఫిర్యాదులో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని, దాన్ని కట్టుకథతోనే కంప్లైంట్ ఇచ్చారన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనను అరెస్ట్ చేస్తే తన రాజకీయ జీవితంతో పాటు ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బ తింటాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడో జరిగిన ఘటన అని తెలిపారు. అప్పుడెప్పుడో జరిగితే పోలీసులకు ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఆయన పిటిషన్‌పై గురువారం (డిసెంబర్ 5న) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
రాజకీయ కక్షతోనే : రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని హరీశ్‌రావు పిటిషన్లో పేర్కొన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది, అదిరేది లేదని తేల్చి చెప్పారు. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా వరుసగా ఏడుసార్లు గెలిచానని, తాను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తినని కోర్టుకు విన్నవించారు. చట్ట ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అంతేగాకుండా ఫోన్ ట్యాపింగ్‌పైనా చక్రధర్‌గౌడ్ గతంలో ఇదే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఉపసంహరించుకున్నారని తెలిపారు.
'బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన మహేందర్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించడం రాజ్యాంగ విరుద్ధం'