Heavy Traffic Jam at Srisailam Ghat Road: శ్రీశైలం ఆనకట్ట పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాసేపు వాహనాల రాకపోకలు స్తంభించిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగుతున్న కారణంగా భక్తులు తెలంగాణ వైపు నుంచి అధిక సంఖ్యలో బస్సులు, కార్లలో తరలి వస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు తెలంగాణ మీదుగా శ్రీశైలం చేరుకుంటారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ వైపు నుంచి వస్తున్న వాహనాలు శ్రీశైలం ఆనకట్ట దిగువ భాగాన ఉన్న పెద్ద బ్రిడ్జి వద్ద నుంచి లింగాల గట్టు, జలాశయం వరకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అధికంగా ట్రాఫిక్ సమస్య తలెత్తడం వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ట్రాఫిక్ సమస్య వల్ల వాహనాలు నెమ్మదిగా శ్రీశైలం వైపు కదులుతున్నాయి. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో నంద్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని ట్రాఫిక్ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో పాటు భద్రత దృష్ట్యా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తం అవుతుంది.
Devotee Died At Srisailam: ఇదిలా ఉండగా శ్రీశైలం ఉగాది మహోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లింగాలగట్టు పాతాళగంగలో మునిగి ఓ భక్తుడు మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్కు చెందిన శశిగా గుర్తించారు. ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీశైలం వచ్చిన శశి స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నాడు.
ఆ తర్వాత ఆనకట్ట దిగువ భాగంలో ఉన్న లింగాలగట్టు స్నాన ఘాట్ వద్ద పుణ్యస్నానం చేసేందుకు వచ్చి నీటిలో దిగి మునిగిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్నేహితులు స్థానిక మత్స్యకారుల దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారులు వచ్చి పడవలో గాలించి శశి మృతదేహాన్ని బయటకు వెలికి తీశారు. దీనిపై సమాచారం అందిన వెంటనే శ్రీశైలం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జగన్ బస్సు యాత్ర కోసం విద్యుత్, ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం - CM Jagan Memu Siddam Bus Yatra