Heavy Rains In Tirumala Devotees Problems : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో మోస్తారుగా వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుండి తిరుమలలో ఆగకుండా వర్షం పడుతుంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులు వర్షానికి తడవకుండా కంపార్ట్మెంట్లోకి షెడ్యూల్లోకి ఎప్పటికప్పుడు అనుమతిస్తున్నారు. నిర్విరామంగా భక్తులకు మంచినీళ్లు, పాలు, అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు.
వర్షం కారణంగా తిరుమల అంతటా కూడా దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రతకు చంటి బిడ్డలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు, ఘాట్ రోడ్‌లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు జారిపడే ప్రమాదం ఉండడంతో వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించాలని టీటీడీ సూచించింది. ఎలాంటి ప్రమాదాలకు జరగకుండా ముందు జాగ్రత్తగా ఇంజనీరింగ్, విజిలెన్స్ సిబ్బందిని రెండు ఘాట్ రోడ్లలో అధికారులు అందుబాటులో ఉంచారు.
తిరుమల గిరులు ‘హిమ’గిరులుగా మారాయి. తెల్లని, చల్లని మంచు వీచికల పలకరింపులతో భక్తులు పులకరిస్తున్నారు. ఎంతో మ‘హిమా’న్వితమైన శ్రీవారి ఆలయం పొగమంచులో మనోహరంగా దర్శనమిస్తోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తిరుమలలో వర్షం కురుస్తోంది. జల్లుల్లో తడుస్తూ భక్తులు మురిసిపోతున్నారు. కొండల్ని కమ్మేసిన పొగమంచు దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
రానున్న 36 గంటల్లో అల్పపీడనం - రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
అల్పపీడన ప్రభావంతో ఒంగోలు జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం వర్షం కురిసింది. గత నెలలో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిశాయి. మొత్తం ఎనిమిది రకాల పంటలు దెబ్బతిన్నాయి. జొన్న, అలసంద, పత్తి, వరి, కొర్ర, సజ్జ, మినుము, పొగాకు పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైత్వారీ పంట నష్టం అంచనా వేశారు. 205 గ్రామాల్లో 8,429 మంది పంటలు నష్టపోయినట్లు లెక్కలు తేల్చారు.
ఆ కష్టం నుంచి కోలుకోకముందే మళ్లీ అల్పపీడనం ఏర్పడటం రైతుల్ని కలవర పరుస్తోంది. ఇదిలా ఉంటే 15-20 రోజుల వ్యవధిలో సాగు చేసిన పంటలకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు. భారీ వర్షాలు, ముసురు వాతావరణం ఏర్పడితే మాత్రం అన్ని పంటలకు నష్టం ఉంటుందన్నారు. మంగళవారం కురిసిన వర్షానికి పంటలకు అంతగా నష్టం లేదని జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. వర్షపాతం ఎక్కువైతే తీత దశలో ఉన్న పత్తికి నష్టం తప్పదన్నారు.
"భారీ వర్షాల ఎఫెక్ట్" తిరుమల ఘాట్రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - తిరుపతి విమానం దారి మళ్లింపు