Rainy Season Crops In Telangana : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా జిల్లాల్లో దండిగా వర్షాలు పడుతుండడంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు సమృద్ధిగా చేరుతోంది.
దీంతో మళ్లీ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో అంతంత మాత్రంగానే వర్షాలు పడడంతో మందకొడిగా సాగిన వ్యవసాయ పనుల్లో ఒక్కసారిగా వేగం పెరిగింది. వర్షాలకు తోడు లక్ష రూపాయల లోపు పంట రుణాలు రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిధులు విడుదల చేయడంతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో పనుల్లో తలమునకలయ్యారు.
ఊపందుకున్న సాగు : ప్రధానంగా వరి నాట్లు, పత్తి గింజలు విత్తుకోవడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వానా కాలం సీజన్‌లో సరైన వర్షాలు కురవకపోవడంతో సాధారణ సాగు విస్తీర్ణను వ్యవసాయ శాఖ తగ్గించింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం కోటి 29 లక్షల 32 వేల 310 ఎకరాలుగా నిర్థేశించగా ఇప్పటి వరకు 60 లక్షల 42 వేల 669 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అంటే మొత్తం 46.73 శాతం ఆయకట్టు సాగులోకి వచ్చినట్లైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57 లక్షల 18 వేల 577 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 6 లక్షల 98 వేల 5 ఎకరాల్లో విస్తీర్ణం నాట్లు పడి సాగు ముందుకు సాగుతోంది. అంటే కేవలం 12.21 శాతం మేర మాత్రమే పంట సాగైంది.
సాగు విస్తీర్ణం : మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6 లక్షల 94 వేల 58 ఎకరాలు నిర్థేశించగా ఇప్పటి వరకు 3 లక్షల 10 వేల 63 ఎకరాల్లో పంట సాగవుతోంది. ఇది కూడా 50.88 శాతం సాగు పూర్తైంది. ఈ సారి వర్షాభావం నెలకొన్న దృష్ట్యా కంది సాధారణ సాగు విస్తీర్ణం పెరగబోతోంది. ఇక ప్రధాన వాణిజ్య పంట పత్తి తీసుకుంటే సాధారణ సాగు విస్తీర్ణం 50 లక్షల 48 వేల 904 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 38 లక్షల 42 వేల 676 ఎకరాల్లో 76.11 శాతం మేర సాగవుతోంది.
తెలంగాణలో రికాం లేని వానలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - Heavy Rains Across Telangana