Five People Died Due to Rains in Warangal District : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఐదుగురు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రీ కుమార్తె వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కుమార్తె మృతదేహాన్ని రెస్క్యూ టీం బయటకు తీశారు.
ఆమె వ్యవసాయ శాస్త్రవేత్తగా రాయ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తుండేది. మరోవైపు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో మందపల్లికి చెందిన వృద్ధురాలు మరణించింది. మలుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పశువులను మోతకు తీసుకెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పరకాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయ్యి చివరికి శవంగా బయటకువచ్చాడు.
సింగరేణికి రూ.కోటి నష్టం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం పట్ల ఎప్పటికప్పుడు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లో రోడ్లన్నీ బురదమయం అయ్యాయి.
6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ జాతీయ రహదారి రఘునాథపల్లిలో రోడ్డుపై నిలిచిపోయిన వరద భూపాలపల్లి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరాంఛవాగు, చలి వాగు, మానేరు వాగు భూపాలపల్లి సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరింది.
పలు రైళ్లు నిలిపివేత : భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని పాలేరు, మున్నేరు, ఆకేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పశువులు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. భారీ వర్షాల కారణంగా డోర్నకల్ రైల్వే జంక్షన్లో గౌతమి, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు. గార్లలోనూ పలు రైళ్లను నిలిపివేశారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో సింహపురి, బీదర్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి.
భారీ వర్షాలు: తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు బంద్ - Buses close between Hyd Vijayawada
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ - SCR Cancelled Trains