Heavy Rains in Hyderabad : సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, చిలకలగూడ బేగంపేట్ ప్యారడైజ్ ప్రాంతాల్లో వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఏకధాటిగా పడుతోంది. వాన కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయి. పలుచోట్ల వర్షం దాటికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Telangana Weather Report Today : రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి ఋతుపవనాలు ఈ రోజు మాల్దీవుల్లో కొంతవరకు, కోమరిన్ ప్రాంతంలో కొంత వరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఇవాళ బలహీన పడిందని పేర్కొన్నారు.