Heavy Rains in Hyderabad City : హైదారాబాద్‌లో వర్షం దంచికొట్టింది. చాలా ప్రాంతాల్లో వరుణుడి ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. మలక్ పేట రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరడం వల్ల వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మహబూబ్ మెన్షన్ మార్కెట్ ఎదురుగా రహదారిపై పెద్దఎత్తున వర్షపునీరు నిలిచింది. రహదారులు వరద కాలువలను తలపిస్తున్నాయి.
వర్షపునీటిలో ఆగిపోతున్న వాహనాలను నెట్టుకుంటూ వెళ్తూ ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ క్రమంలో భారీగా రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించేందుకు చర్యలు చెేపట్టారు. ఖైరతాబాద్, పంజాగుట్ట చౌరస్తాల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీగా నిలిచిన వర్షపు నీటిని ఖాళీచేసేందుకు బల్దియా యంత్రాంగం రంగంలోకి దిగింది. వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ రహదారుల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Many Places Rain in Hyderabad : అప్రమత్తమైన ట్రాఫిక్ యంత్రాంగం చాలా ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్, కొండాపూర్, రాయదుర్గం, చాదర్‌ఘాట్, సరూర్‌నగర్, అమీర్‌పేట, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌లో జడివాన కురిసింది. మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట్, కొత్తపేట్ ముషీరాబాద్, కవాడిగూడ, చిక్కడపల్లి బాగ్‌లింగంపల్లి, మెహిదీపట్నం గుడిమల్కాపూర్, చార్మినార్, చాంద్రాయణగుట్టలోని పరిసార ప్రాంతాల్లో రోడ్లను వర్షపు నీరు ముంచెత్తింది. కాగా అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు వర్షం ఉపశమనం కలిగించింది.
భాగ్యనగరంలో భారీ వర్షం : హైదరాబాద్‌లోని పాతబస్తీ బహదూర్ పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, బార్కస్, ఫలక్‌నుమ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రోడ్లపై ఉప్పొంగిన వర్షం నీటితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్స్ రోడ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కింద రోడ్‌పై వర్షం ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, ఛత్రినాకా ప్రాంతంలో సైతం రోడ్‌పై వర్షం నీరు భారీగా నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. నూర్ ఖాన్ బజార్, బాల్ శెట్టి ఖేత్ ప్రాంతంలో రోడ్‌పై వర్షపు నీరు నిలిచింది.
వర్షాకాల అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణం స్పందించాలి : సీఎం రేవంత్