Heavy Rains in AP Waterlogged in Lowline Areas : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. సత్యవేడు, నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో అల్పపీడన ప్రభావం అధికంగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో స్వర్ణముఖి నదిలో నీటి మట్టం పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తిరుమల కొండ మీద నుంచి వస్తున్న నీటితో తిరుపతిలోని కాలనీల్లోకి భారీగా నీరు చేరింది. తిరుమలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి ఆలయాలకు భక్తులను అనుమతించడం లేదు. శ్రీవారి దర్శనానికి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఇవాళ శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు వంతెనలు, కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తుండటంతో ఆర్టీసీ అధికారులు కొన్ని మార్గాల్లో బస్సు సర్వీసులను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. తిరుపతి-చెన్నై మధ్య కొన్ని రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్ కలెక్టరేట్‌లో ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను అందుబాటులో ఉంచారు. రేణిగుంట మండలం ఎల్లమంద్యంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. తిరుపతి అర్బన్ పరిధిలో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
"భారీ వర్షాల ఎఫెక్ట్" తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - తిరుపతి విమానం దారి మళ్లింపు
Heavy Rains In Rayalaseema : ఉమ్మడి కడప జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాల్లోని ఒంటిమిట్ట, పోరుమామిళ్ల, కడప, వేంపల్లె మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒంటిమిట్ట, కమలాపురం మండలాల్లో వరి, మినుము పంటలు దెబ్బతిన్నాయి. కడపలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండు రెండు రోజుల నుంచి జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరిపంట దెబ్బతింది. ఇవాళ కూడా తుపాను ప్రభావం అధికంగా ఉంటుందనే సమాచారంతో అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
Heavy Rain Lashes In South Kosta : ప్రకాశం జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాగులప్పలపాడు మండలంలోని కొత్తకోట వాగు మూడు రోజులగా రహదారి మీదుగా ప్రవహిస్తోంది. దీంతో మద్దిపాటు, నాగులుప్పాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగులుప్పాడు మండలంలోని పంట పొలాలు వర్షాల వల్ల నీట మునిగాయి. చదలవాడ 216 జాతీయ రహదారి పక్కన ఉన్న చెరువు కట్ట తెగి రోడ్డు మీదకు నీరు రావడంతో రాకపోకలు నిలిపివేశారు. గిద్దలూరులో సగిలేరు వాగు, C.S పురం మండలంలో భైరవకోన జలపాతం ఉద్ధృతంగా ఉన్నాయి. ఒంగోలు మినీ బైపాస్ పక్కన ఉన్న జలవనరుల శాఖ SE కార్యాలయం, ప్రగతి భవాలు నీట మునిగాయి. జలవనరుల శాఖ కార్యాలయ స్థలాన్ని గత ప్రభుత్వం లీజుకు తీసుకుని దానిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం బాగా ఎత్తులో నిర్మించడం వల్ల వర్షం నీరంతా జలవనరుల శాఖ కార్యాలయాన్ని ముంచెత్తుతుంది. ఒంగోలు శివారులోని పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. కొత్తపాలెం మండలం కే.పల్లిపాలెం వద్ద సముద్రం పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. 100 మీటర్లకు పైగా ముందుకొచ్చింది. మత్స్యకారుల వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
వర్షాలకు బాపట్ల జిల్లా జె.పంగలూరు మండలం, కొండమూరు, రేణింగవరంలో మినప పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారులు నేలకొరిగిన మినప పంటను పరిశీలించారు. రెండు రోజుల్లో పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించి రైతులకు న్యాయం చేస్తామని అధికారులు చెప్పారు. చీరాల మండలంలోని గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లు చిత్తడిగా మారాయి. వాడరేవులోని వైఎస్సార్ కాలనీలో వర్షపు నీరు చేరడంతో పోలీసులు ప్రొక్లెయినర్‌తో నీటిని బయటకు పంపిస్తున్నారు.
ప్రకాశం జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు - మరికొద్ది గంటల్లో వాయుగుండం!