Rains in Andhra Pradesh : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అల్పపీడనం క్రమేపీ బలహీన పడుతోందని ప్రకటించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని ఒకటి రెండు చోట్ల భారీగాను, చాలా చోట్ల వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర కోస్తాలో చాలా చోట్ల నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. మంగళవారం విజయవాడలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. దీనికితోడూ మురికి కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నీట మునిగిన పంటపొలాలు : మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అనకాపల్లి జిల్లా పరవాడ పైడితల్లి అమ్మవారి గుడికి అనుకుని ఉన్న చెరువుకు గండి పడింది. దీంతో వరి పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నీటమునిగిన పొలాలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడంతా వరద పాలైందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలో వాన దంచికొట్టింది వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బ్రహ్మంగారిమఠం సమీప సోమిరెడ్డిపల్లె వద్ద వంక పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా బద్వేలు-బ్రహ్మంగారిమఠం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
బద్వేల్ మున్సిపాలిటీలో రాత్రి కురిసిన వర్షానికి వీధులు జలమయ్యాయి. దీంతో ప్రజలు బయటకి వెళ్లేందుకు జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వరద నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అమ్మిరేకుల- కిమ్మలగెడ్డ మార్గంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఓ ద్విచక్ర వాహనదారుడు వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ నీటిలో కొట్టుకుపోయింది. అప్రమత్తమైన వాహనదారుడు వెనక్కి వచ్చాడు. స్థానికులు బైక్ను నీటిలో నుంచి బయటకుతీశారు. మరోవైపు ప్రవాహ సమయంలో గెడ్డలు దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి- ఎడతెరిపిలేని వర్షాలతో ప్రమాదకరంగా వాగులు - Heavy rains in Uttarandhra
రహదారులకు వరద కష్టం - రాష్ట్రవ్యాప్తంగా 5,921 కి.మీ. ధ్వంసం - Roads Destroyed in ap