Heavy Rains Effect in Telangana : నిన్నమొన్నటి దాక ఎండలు ఎడతెరిపి లేకుండా దంచికొట్టాయి. ఇవాలేమో ఒక్కసారిగా రాష్ట్రమంతటా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగు పడి జనగామలో ఒకరు, ములుగు జిల్లా ఏటూరునాగరంలో మరొకరు చనిపోగా, అక్కడక్కడ మూగజీవాలు కొన్ని మృత్యువాత పడ్డాయి.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి : రఘునాథ పెళ్లి మండలం కోడూరులో పిడుగు పడి దాసరి అజయ్(23) అనే యువకుడు చనిపోయాడు. పిడుగు పడిన సమయానికి అక్కడే ఉన్న యువకుడి తల్లి రేణుక తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పిడుగుపాటులో అజయ్‌తో సహా రెండు గేదెలు కూడా చనిపోయాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఓడగూడెంలో పిడుగు పాటుకు బాస బుల్లోడు (46)అనే రైతు మృతి చెందాడు.
వరంగల్ జిల్లా కేశవపురం గ్రామంలో ఈదురుగాలులతో కురిసిన వర్షం ధాటికీ చేతికందిన మామిడి పంట నేల రాలింది. ఈ కారణంగా మామిడి రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అలాగే గాలివానకు రేకుల షెడ్డుపై విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్టైంది.
రాష్ట్రంలో ఈదురు గాలుల ఎఫెక్ట్ : మరోవైపు భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి, బీబీ నగర్, పోచంపల్లిలో వాతావరణం చల్లబడగా, వలిగొండలో చిరు జల్లులు 10 నిమిషాల పాటు కురిసి ఆగిపోయాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్, మద్దిరాల, అర్వపల్లి, తిరుమలగిరి, మోత్కూరుతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలతో కూడిన వర్షానికి ఇంటి పైకప్పులు లేచిపోయాయి. చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
నల్గొండ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు చేసి మిల్లులకు తరలించేందుకు లారీలలో నిలువ చేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసి ముద్దవ్వటంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. యాదాద్రి జిల్లాలోని గుండాల, వలిగొండ, మోత్కూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నల్లగొండలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. చండూరు. చిట్యాల, నకిరేకల్, నాంపల్లి, నూతనకల్, నార్కట్‌పల్లి ప్రాంతాల్లో వడగల్లు పడ్డాయి. ఈదురు గాలులతో మిర్యాలగూడ, హాలియా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఉరుములుతో కూడిన వర్షం వల్ల కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పోసిన మొక్కజొన్న, వరి రాశులు పూర్తిగా తడిసిపోయాయి. ధాన్యం రాశుల్లోకి వర్షం నీరు చేరటంతో, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు కాలాలు కష్టపడి పండించిన పంట నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాని విన్నవిస్తున్నారు.
ప్రకృతి కన్నెర్రకు పెట్టుబడి వర్షార్పణం - అకాల వర్షాలతో అన్నదాత అతలాకుతలం - crop damage in telangana
పంట నష్టంపై వ్యవసాయ శాఖ ఫోకస్ - నిధుల విడుదలకు సిద్ధమన్న మంత్రి తుమ్మల - crop damage in telangana