IMD Warns Heavy Rains in AP : బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోంది. ఇది గురువారం పుదుచ్చేరి, ఏపీలోని నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వైపు దూసుకొస్తున్న వాయుగుండం ప్రభావంతో ఆంధ్రాలోని నెల్లూరు, వైఎస్సాఆర్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారముందని ఐఎండీ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
నెల్లూరులో కుంభవృష్టి : వాయుగుండం ప్రభావంతో ఏపీలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతోంది. కావలిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిలాల్లోని తీర ప్రాంత మండలాల్లో గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. వర్షాల ప్రభావంతో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఆ జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నగరంలోని పెన్నా బ్రిడ్జి సమీపంలో పడిన గండిని పూడ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
తిరుమలలో భక్తులు ఇబ్బందులు : తిరుపతి జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంఘాల పరిధిలో వీధులు జలమయం అయ్యాయి. సూళ్లూరుపేటలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పర్యటించారు. స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కడపలో రాత్రి భారీ వర్షం : కడప నగరంలో రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. భరత్‌నగర్, అక్కయ్యపల్లి, శాస్త్రినగర్, గంజికుంట కాలనీ, అల్లూరి సీతారామరాజు నగర్, లోహియా నగర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
డ్రోన్లు వినియోగం : అన్నమయ్య జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షం పడుతోంది. నేడు జిల్లాలో భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు.
రహదారులపై రెండు అడుగుల మేర నీరు : అనంతపురం జిల్లావ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. అనంతపురంలో రహదారులపై పలుచోట్ల రెండు అడుగుల మేర నీరు నిలిచింది. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది.
తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు? - వాటి వెనుక ఉన్న స్టోరీ ఏంటో మీకు తెలుసా?
అల్పపీడన ద్రోణితో అల్లకల్లోలంగా మారిన కోస్తా జిల్లాలు - ఆ జిల్లాల్లో రెడ్ అలెర్ట్