Heavy Rain in Telangana Today : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం, ఎర్రుపాలెం, మధిర, ముదిగొండ, కుసుమంచి మండలాల్లో భారీ వర్షాలు కురవగా మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఎర్రుపాలెం-కృష్ణాపురం వద్ద ప్రధాన రహదారిపైకి వరద పోటెత్తడంతో ఆర్టీసీ బస్సు వాగు ఉద్ధృతితో చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసులు కలిసి ప్రయాణికులను తాడు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అడ్డాకుల మండలం ఊకచెట్టు వాగు ఉద్ధృతితో తాత్కలికంగా ఏర్పాటు చేసిన మట్టి వంతెన కొట్టుకపోయింది. పలు గ్రామాలుకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ని వద్ద పెద్దవాగు పొంగి పొర్లి ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో కొండల పైనుంచి జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వనపర్తి జిల్లా పామాపురం చెక్‌డ్యాం 36 అడుగుల శివుడి పక్క నుంచి పొంగిపొర్లుతోంది. భారీ వర్షాల నేపధ్యంలో కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. హనుమకొండ, ఖాజీపేటలో ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జాతీయ రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నార్లాపూర్ గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి పిడుగుపాటుకు మృతి చెందాడు. భారీ వర్షాలకు నల్లగొండ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ట్రాన్స్‌ఫార్మర్లు సైతం నీట మునిగాయి : డ్రైనేజీలు పొంగడంతో జనావాసాల్లోకి మురికి నీరు చేరింది. మిర్యాలగూడలో బస్టాండ్ సమీపంలో గల విద్యుత్ కార్యాలయం వద్ద మోకాలు లోతున వర్షపునీరు చేరి వినియోగదారులు నానా అవస్థలు పడ్డారు. సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలోకి మురికి నీరు చేరి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. హుజూర్‌నగర్ వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
వాహనాలను మిర్యాలగూడ మీదుగా నల్గొండ, నార్కెట్‌పల్లి వైపు మళ్లించారు. దేవరకొండలో ఓ పాఠశాలలోకి వర్షపు నీరు చేరి విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు పడ్డారు. పట్టణంలోని రోడ్లు జలమయం అయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఏపీలో పలు చెరువులు, కుంటలు తెగి భారీగా వరద నీరు వైరా నదిలోకి చేరుతోంది. దీంతో మధిర ఐపీడీఎస్ సబ్ స్టేషన్‌లోకి వరదనీరు చేరి రెండు ట్రాన్స్‌ఫార్మర్లు సైతం నీట మునిగాయి. మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది అర్ధరాత్రి సమయంలో శ్రమించి యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేపట్టారు.