Hearing on MLC Kavitha Bail Petition in Rouse Avenue Court : దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. తన మైనర్ కుమారుడి పరీక్షల దృష్ట్యా ఈ నెల 16వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని గత నెల 26న ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్పై సమాధానం చెప్పాలని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈడీకి నోటీసులు కూడా జారీ చేసింది.
Kavitha In Judicial Custody : దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో గత నెల 15న కవితను హైదరాబాద్లోని తన నివాసంలో ఈడీ అరెస్టు (Kavitha ED Arrest ) చేశారు. మరుసటి రోజే దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపరిచారు. ముందుగా కవితను 10 రోజలు కస్టడీకి ఈడీ కోరగా, న్యాయస్థానం 7 రోజులకు అనుమతి ఇచ్చింది.అనంతరం మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా, మూడురోజులకు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగియటంతో అదేరోజు రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఆమెను హజరుపరుచారు.
Delhi liquor Scam : కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నందున 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. అప్పుడు కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యిందని కోర్టుకు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 9 వరకూ ఈ రిమాండ్ కొనసాగుతుండగా, ఆమెను తిహాడ్ జైలుకు అధికారులు తరలించారు.
వసతులు కల్పించని ఈడీ : ఈ నేపథ్యంలోనే కవిత దాఖలు చేసిన మేరకు మధ్యంతర బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. మరోవైపు తన విజ్ఞప్తి మేరకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయినా తన విజ్ఞప్తి మేరకు అధికారులు అనుమతించటం లేదంటూ కవిత తరఫు న్యాయవాది రెండురోజుల క్రితం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపైనా కోర్టు విచారణ చేపట్టనుంది.
దిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు - కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా - Delhi liquor scam updates