HC on Rajdhani Files Movie Release: 'రాజధాని ఫైల్స్' సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని స్పష్టం చేసింది. సీఎం జగన్, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని.. గతేడాది డిసెంబర్ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి 'రాజధాని ఫైల్స్' చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది.
రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శనకు హైకోర్టు అనుమతిస్తూ నాగలికి న్యాయం చేసిందని ఆ చిత్ర దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. అహానికి అడ్డువేసి రైతుదే అంతిమ విజయమని న్యాయస్థానం రుజువు చేసిందని తెలిపారు. రాజధాని ఫైల్స్ చిత్రం ఏ వ్యక్తి లక్ష్యంగా చిత్రీకరించలేదని ఆ అవసరం తమకు లేదన్నారు. ప్రభుత్వం రైతుల జోలికి వెళ్లకుండా ఉంటే తాము ఆ చిత్రాన్ని తీసి ఉండేవాళ్లం కాదని నిర్మాత కంఠంనేని రవిశంకర్, దర్శకుడు భాను తెలిపారు. తమ చిత్రాన్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన వారు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజధాని ఫైల్స్ ప్రదర్శితమవుతుందని స్పష్టం చేశారు. రైతులకు సంఘీభావంగా ప్రతి ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి తమ చిత్రాన్ని ఆదరించాలని రవిశంకర్, భాను విజ్ఞప్తి చేశారు.