Hawk in Bhadradri District : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఓ ఊహించని అతిథి వచ్చింది. కెమెరా, జీపీఎస్ ట్రాకర్‌తో ఉన్న ఒక రాబందు చర్ల మండలంలో సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడి నుంచో వచ్చిన రాబందు చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలోని గుట్టపై వాలింది. అక్కడే చాలాసేపు ఉండిపోయింది. తిరిగి తిరిగి వచ్చిన రాబందు అలసిపోవడంతో గమనించిన స్థానికులు కోడి మాంసం, నీటిని అందించారు.
ఆకలితో ఉన్న రాబందు కోడి మాంసాన్ని తిని ఆకలి తీర్చుకుంది. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న మరికాసేపటికే తర్వాత వేరే ప్రాంతానికి ఎగిరి వెళ్లిపోయింది. అక్కడ ఉన్న స్థానికులు రాబంధు ఫోటోలను వీడియోలను చిత్రీకరించారు. దాని కాళ్లకు జీపీఎస్ ట్రాకర్‌తో పాటు కెమెరా కూడా ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ రాబందు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంపై మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులను వివరణ అడగగా తమకు సమాచారం అందలేదని వారు తెలిపారు. ప్రస్తుతం రాబందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. పూర్తిగా ఎదిగిన రాబందు ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలుసుకునేందుకే దీనికి ట్రాకర్, కెమెరా అమర్చి ఉంటారని పక్షి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో రాబందుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం 50 కంటే తక్కువే ఉన్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ సమతుల్యతలో రాబందుల పాత్ర చాలా కీలకం. అందుకే ఈ జాతిని అంతరించిపోకుండా కాపాడేందుకు పక్షి ప్రేమికులు, శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. వీటి సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటవీ శాఖ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైంది. వీరి సంరక్షణ చర్యల పుణ్యమా రాష్ట్రంలో వీటి సంఖ్య 30కి పైగా చేరింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా వీటి సంతతిని సంరక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్న పావురాల గుట్ట వీటికి కేంద్రం. ఈ ప్రాంతాన్ని 'జటాయువు' పేరుతో రాబందుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి కూడా విజ్ఞప్తి పంపింది.