Harishrao Reacts on Handover of projects to KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) మండిపడ్డారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలనే పేర్కొంటూ 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని పేర్కొన్నారు.
గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లారు: హరీశ్‌రావు
Govt Agrees to Projects Handover to KRMB : ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు(KRMB) అప్పగిస్తున్నట్లు ఇవాళ రెండు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ముందు ప్రకటించారని, 27వ తేదీ లేఖ ప్రామాణికమా? ఇవాళ్టి అంగీకారం ప్రామాణికమా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని ఆక్షేపించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించారని చెబితే హరీశ్‌రావు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తామని గొప్పగా చెప్పారని మాజీ మంత్రి గుర్తు చేశారు.
కానీ ఇవాళ ఏం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరని వ్యాఖ్యానించారు. జల విద్యుత్ హౌస్‌ల గురించి చర్చ లేదని చెప్తున్నారు కానీ, బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమా? అని అడిగారు. బోర్డు అనుమతి లేనిదే రాష్ట్ర ఇంజినీర్లు, అధికారులు కనీసం ప్రాజెక్టుల వద్దకు వెళ్లే పరిస్థితి ఉండబోదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’గా కాంగ్రెస్ స్టాఫ్ నర్సుల నియామక పత్రాల జారీ : హరీశ్‌రావు
మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం, ఏపీ చేతిలో పెట్టడమా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా అని సర్కార్‌ను నిలదీశారు. అందరితో చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇవాళ ఎలా అంగీకరించిందని అడిగారు. ప్రాజెక్టులు అప్పగించబోమని ఓ వైపు నాయకులు చెబుతారని, మరోవైపు సమావేశాల్లో అధికారులు అంగీకరించి వస్తారని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టుల అప్పగింతపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శనివారం సమీక్ష నిర్వహించారని, ఇవాళ ఈఎన్సీ కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్లి ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించి వచ్చారని పేర్కొన్నారు. 2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చినా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదన్న హరీశ్‌రావు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో దీంతోనే స్పష్టం అవుతోందని, తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని కోరారు. తాను రాజకీయాల కోసం మాట్లాడడం లేదన్న ఆయన, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని అన్నారు. మేధావులు మౌనం వీడాలని కోరారు.