Harishrao Speech in Assembly Today : బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా లేదని, గ్యారంటీలను పాతరేసి కాంగ్రెస్ ధోకా పార్టీగా మారిందని బీఆర్ఎస్ మండిపడింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ మీటర్ల విషయంలో, కేంద్రంతో ఒప్పందాలు చేసుకొని నేడు అబద్ధాలు చెప్తున్నారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీశ్‌రావు స్పందించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైనా మీటర్లు పెట్టిందా? అని ఆయన ప్రశ్నించారు. మీటర్లు పెట్టి ఎఫ్ఆర్బీఎం ద్వారా రూ.30 వేల కోట్లు రుణాలు అప్పులు తీసుకున్నామా? అని నిలదీశారు.
క్షమాపణ చెప్పాలి.. గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ పరువు తీశారని, సోనియా ప్రతిష్టను దిగజార్చారని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇంకా ఎన్నాళ్ళు తమ పేరు చెప్పుకొని, విమర్శిస్తూ బతుకుతారని ఆక్షేపించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారని, కానీ నేడు బడ్జెట్‌లో గ్యారంటీలకు ఓటాన్ అకౌంట్ కంటే తక్కువ కేటాయించారన్నారు. ప్రభుత్వం గ్యారంటీలు హామీలు అమలు చేయలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బడే భాయి బాటలోనే.. మైనార్టీల సంక్షేమం విషయంలో బడే బాయ్ తరహాలోనే చోటా బాయ్ కూడా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంత్రి వర్గంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆయన ఆక్షేపించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారని, బేషజాలకు పోకుండా హామీలు అమలు చేయాలి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన చూసి కాళోజీ నా గొడవ పుస్తకం ఎంతగా ఘోషించిందోనని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా దెబ్బతిన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాంత్రిభద్రతల సమస్యలు ఉన్నాయని, గడిచిన 8 నెలల్లో నగరంలో 500 హత్యలు, 1800 రేప్ కేసులు నమోదయ్యయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలతో హైదరాబాద్ నగర ప్రతిష్ఠ దెబ్బతింటుందని హరీశ్‌రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌గాంధీ నిరుద్యోగుల వద్ద మాట్లాడారని, ప్రజాస్వామిక పాలన అని నిరుద్యోగులపై లాఠీలు జూలిపిస్తున్నారని మండిపడ్డారు.
"ఆరు గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ పరువు తీశారని, సోనియా ప్రతిష్టను దిగజార్చారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారు. కానీ నేటి బడ్జెట్‌లో గ్యారంటీలకు, ఓటాన్ అకౌంట్ కంటే తక్కువ కేటాయించారు. ప్రభుత్వం గ్యారంటీలు హామీలు అమలు చేయలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పాలి". - హరీశ్‌రావు, మాజీమంత్రి