Hanuman Jayanthi Celebrations in Telangana : హనుమాన్ జయంతి పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం రామనామ జపంతో మారుమోగుతోంది. దీక్ష విరమణ చేసేందుకు రాష్ట్ర నలమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కాషాయమయంగా మారాయి. అర్థరాత్రి నుంచే కొండగట్టు కొండంత భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి వారి జయంతిని పురష్కరించుకుని వేకువజామునే ఆంజనేయుడికి తిరుమంజనం, ద్రావిడ ప్రబంధ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి రాములోరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే స్నానాల కోసం గోదావరికి హనుమాన్ మాలధారులు కదిలి రావడంతో నది పరివాహక ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి.
కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు - కాషాయమయంగా మారిన పరిసరాలు - Hanuman Jayanti 2024
Tadbund hanuman Jayanthi utsavalu : ఖమ్మం జిల్లా ఏనుకూర్‌లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహంచారు. ఉమ్మడి జిల్లాలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి పొటెత్తిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్విహించారు.ఆంజనేయుడు అవతారంలో ముస్తాబైన చిన్నారులు జై హనుమాన్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ తాడ్ బండ్ హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరగాయి.
తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామికి ఫలాలు, పుష్పాలు సమర్పించి వాయుపుత్రుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి అంబుజ తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ మున్సిపాలిటీ పరిదీలోని గోవింద పురం శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మారుతి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తిన భక్తజనం స్వామివారికి అభిషేకాలు,తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.