GVMC Officials Notices to YSRCP Office: ఎలాంటి అనుమతుల్లేకుండా అనధికారికంగా నిర్మాణం చేపట్టిన వైఎస్సార్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు నోటీసులు అంటించారు. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాదరావు పేరుతో నోటీసులు జారీ చేశారు. ఎండాడ రెవెన్యూ లోని 175/4 సర్వే నంబర్ లో సుమారు రెండు ఎకరాల స్థలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అయితే ఇకపై ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని నోటీసులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.
అయితే వీటి అనుమతి విషయంలో కూడా చాలా డ్రామా చోటుచేసుకుంది. ఎండాడలోని సర్వే నెంబరు 175/4లో రెండెకరాల స్థలాన్ని 2022 మే నెలలో వైఎస్సార్సీపీ సర్కార్ కేటాయించింది. ఎకరా 60 కోట్ల రూపాయల విలువజేసే స్థలాన్ని కేవలం ఏడాదికి వెయ్యి రూపాయల అద్దె చెల్లించేలా 33 సంవత్సరాల పాటు లీజుకు రాయించేసుకున్న వైఎస్సార్సీపీ ఆగమేఘాలపై నిర్మాణాలు చేపట్టింది. అధికారం అండతో అనుమతులు తీసుకోకుండానే కట్టడాలను పూర్తి చేసింది.
సాధారణంగా జీవీఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. కానీ, వీఎంఆర్డీఏకు 10 వేల రూపాయలు చెల్లించి, దరఖాస్తు చేసి వదిలేశారు. గత 525 రోజులుగా మాస్టర్ ప్లాన్ అనుమతులు రాకపోవడంతో దరఖాస్తు లాగిన్ దశలోనే ఉంది. ఈనెల 20వ తేదీన మధురవాడ జోన్-2 సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి వైఎస్సార్సీపీ కార్యాలయ భవనాల వద్దకు వెళ్లి, ప్లాన్ ఉందా లేదా అంటూ ప్రశ్నించారు.
అయితే అక్కడున్న ఓ మహిళ ఎప్పుడో భవనం పూర్తైతే ఇప్పుడు ప్లాన్ ఏంటి అని, ఏమైనా ఉంటే ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడుకోండి అంటూ సమాధానమిచ్చింది. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు ఆగమేఘాలపై కదిలారు. అయితే ఈ లోపు జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్‌లోని అధికారులు దస్త్రాన్ని నిలిపివేశారు. తాజాగా వైఎస్సార్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ జోన్ - 2 అధికారులు నోటీసులు అంటించారు.
మరోవైపు అనకాపల్లిలో జగన్ మరో ప్యాలెస్ నిర్మాణం అంటూ వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. పార్టీ కార్యాలయం కోసం భారీ భవన నిర్మాణం చేస్తున్నారు. హైవే సమీపంలోని కోట్ల రూపాయలు విలువ చేసే 1.75 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్లు లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఏడాదికి ఎకరానికి కేవలం వెయ్యి రూపాయలు చెల్లించేలా గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. జీవీఎంసీ అనుమతులు లేకుండానే పార్టీ కార్యాలయం కోసం భారీ భవనం నిర్మాణం చేస్తున్నారు. దీనికి జీవీఎంసీ, వీఎంఆర్డీఏ నిధులతో రోడ్లు, విద్యుత్ లైట్లు సైతం ఏర్పాటు చేశారు.