Grand Tribute to Ramoji Rao in across AP : తెలుగుజాతి చరిత్రలో మరో శకం ముగిసింది. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జనోద్ధరణకే అంకితం చేసిన రాజయోగి, అక్షర కదన రంగాన కర్మయోగి, కడ వరకూ పనిలోనే పరిశ్రమించిన రామోజీరావు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించే ఈనాడును, సామాన్యుడి గొంతుకగా నిలిచే ఈటీవీని తెలుగుజాతికి అందించి సెలవు తీసుకున్నారు. తెలుగు ఖ్యాతిని గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కించిన రామోజీ ఫిల్మ్‌సిటీ ఆవరణలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు,రామోజీ గ్రూప్ సిబ్బంది కడసారి వీడ్కోలు పలికారు.
తెలుగు సారధి వెలుగు వారధి- రామోజీరావు జీవితమొక తెరిచిన పుస్తకం! - Media Mogul Ramoji Rao Passed Away
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకారులు రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు ఈనాడు రిలీఫ్ ఫండ్ ద్వారా ఐదు కోట్ల వ్యయంతో ఉమిలాడలో 28 ఇళ్లు, మేఘవరంలో 36 ఇళ్లతో పునరావాస కాలనీ నిర్మించారని గుర్తుచేసుకున్నారు. కాలువలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించిన రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీకాకుళం తెలుగుదేశం కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ పార్టీ నాయకులతో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాత్రికేయులతో కలిసి రామోజీరావుకు నివాళులర్పించారు. నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో పాత్రికేయులు ఆర్డీఓ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత గాంధీ కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రామోజీరావు పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు - Chandrababu Tribute to Ramoji
అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఈనాడు, ఈటీవీ ప్రతినిధులు, ఎన్జీఓలు, ఉద్యోగ సంఘాల నాయకులు రామోజీరావుకు నివాళులర్పించారు. సింగనమలలో తెలుగుదేశం నాయకులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కల్యాణదుర్గం నియోజకవర్గంలోనూ పలుచోట్ల రామోజీరావుకు సంతాపం తెలిపారు. అనంతపురంలో APUWJ ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.
రామోజీరావు మృతి పట్ల ఇతర దేశాల్లోనూ పలువురు సంతాపం తెలిపారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో రామోజీరావుకు ప్రవాసాంధ్రులు శ్రద్ధాంజలి ఘటించారు. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి లక్షల మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు. తెలుగుజాతి కీర్తిని విరజిమ్మిన ఆదర్శమూర్తి, స్ఫూర్తిప్రదాత, దార్శినికుడు, సమాజసేవకుడు, నిత్యకృషీవలుడు రామోజీరావు అని కాకతీయ సేవాసమితి డల్లాస్ అమెరికా వారు కొనియాడారు.
రామోజీరావు సంస్మరణ సభను డల్లాస్ లోని ఫ్రిస్కోలో కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. రామోజీరావు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి పట్టుదలతో ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, రామోజీ ఫిలింసిటీ లాంటి ఎన్నో సంస్థలను స్థాపించి ఎందరికో ఉపాధి కల్పించి సమాజసేవ చేసిన మహోన్నత వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. అలాంటి వ్యక్తి అస్తమించడం తెలుగు ప్రజలకు తీరనిలోటని ఎన్నారైలు అన్నారు. ఆయన మృతిపట్ల వారి కుటుంబ సభ్యులకు, రామోజీ గ్రూపు సంస్థలలో పనిచేసేవారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామోజీరావుకు కళాత్మక నివాళులు- కళాకారుల కన్నీటి వీడ్కోలు - Sand Micro Artists Tribute to Ramoji Rao