Govt Employees Postal Ballot Voting process: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ చాలాచోట్ల గందరగోళంగా మారింది. ఉదయం 7గంటలకే ప్రారంభం కావల్సిన పోలింగ్, ఆలస్యంగా మొదలైంది. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ లేకపోవడంపై, ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఓటు వేయకుండా ఉండేందుకు, ప్రభుత్వం, అధికారులు కుట్ర పన్నారని మండిపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ తొమ్మిదిన్నర వరకు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. ఒకే చోట ముగ్గురు నలుగురు ఓటు వేయడం, కనిపించింది. ఓటు వినియోగించుకునే ఉద్యోగులతో పాటు, వైసీపీ నేతలూ పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో... ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఆచూకీ లేకపోవడంతో, వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరులో ఏర్పాటుచేసిన బ్యాలెట్ ఓటింగ్‌పై, కొంత అవగాహనారహిత్యం కనపడింది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఓటర్లు ఇబ్బందులు గురయ్యారు. గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఓట్లు ఉన్న ఉద్యోగులు, ప్రస్తుతం కృష్ణా జిల్లా పరిధిలో ఉద్యోగం చేస్తున్నారు. వారిఓట్లు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నా ఓటు మాత్రం వేయవలసిన ప్రాంతం మచిలీపట్నంలో ఉంది. ఈ విషయంపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరులోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు అయోమయం నెలకొంది. తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోవాలో కూడా,సరైన వివరాలు అధికారులు చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కావాలనే అవస్థలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్‌లో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఒంగోలు డీఆర్ఎమ్ కేంద్రం వద్ద ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు,పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పడంతో ఉద్యోగులు 6 గంటలకే వచ్చారు. అధికారులు మాత్రం పది గంటలు దాటినా, రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కనిగిరిలోనూ ఉద్యోగులకు నిరీక్షణ తప్పలేదు. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 8 గంటల వరకు ప్రారంభం కాలేదు. మార్కాపురంలో 11 గంటలైనా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలు కాలేదు. రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాప్తాడు టీటీడీసీ కేంద్రంలో పీఓ, ఏపీఓ లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టారు. అయితే, మడకశిర, పెనుకొండ, హిందూపురం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం లేకుండా చేశారని ఉద్యోగులు ధర్నాకు దిగారు. కేంద్రం వద్దనే బైఠాయించి నినాదాలు చేశారు.
ఆ ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు అవకాశం కల్పించాలి : కేఆర్ సూర్యనారాయణ - Employees Round Table