Govt Employees in Election Campaign: ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసినా అవి అమలు కావడం లేదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంకు వచ్చిన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి వచ్చారు. అయితే ఉద్యోగులకు సంబంధించిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల వెంకటరామిరెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. గ్రామస్థాయిలో జరిగిన అభివృద్ధి రాష్ట్ర స్థాయిలో జరిగినట్లు కాదా అని ఆయన ప్రశ్నించారు.
అదే విధంగా ఇదిలా ఉండగా నేనేమీ తక్కువ కాదంటూ ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్టీసీ ఉద్యోగి కూడా వైసీపీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఈ విధంగా పాల్గొనకూడదంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం హెచ్చరించింది. మరోవైపు తాజాగా ఇద్దరు ఉద్యోగులపై సైతం వేటు వేసింది.
ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లపై వేటు: చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను తొలగించారు. ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. జీపీ గుడుపల్లి మండలం చీకటిపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థితో కలిసి టెక్నికల్ అసిస్టెంట్ ఎం.వెంకటేష్ పాల్గొన్నారు. అదే విధంగా కుప్పం మండలం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థితో కలిసి టెక్నికల్ అసిస్టెంట్ జి. మురుగేష్ పాల్గొన్నారు. ఈసీ ఆదేశాలు ఉల్లంఘించారంటూ ఇరువురిని తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల కోడ్ వచ్చినా డోట్ కేర్ - వైసీపీ ప్రచారకర్తలుగా వాలంటీర్లు
మరోవైపు తీరు మార్చుకోని వాలంటీర్లు: ఓ వైపు ఉద్యోగులు ఈసీ ఆదేశాలు ఉల్లంఘిస్తుంటే, మరోవైపు వాలంటీర్లు కూడా యథేచ్ఛగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పోతవరంలో వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శించి వైసీపీ నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. లక్ష్మక్కపల్లి , లింగన్నపాలెం గ్రామ సచివాలయానికి చెందిన ఇద్దరు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ప్రచారంలో హడావుడి చేశారు.
వైసీపీ నేత భూజాలపై చేతులు వేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తూ వాలంటీర్లు, ఉద్యోగులు వైసీపీ నాయకులతో కలిసి పార్టీ ప్రచారంలో పాల్గొనడాన్ని విపక్ష పార్టీలు తప్పు పడుతున్నాయి. దీనిపైన అధికారులు కఠిన చర్యలు తీసుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు తోడ్పడాలని కోరుతున్నారు.
ఏడుగురు వాలంటీర్లు తొలగింపు: కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏడుగురు వాలంటీర్లను అధికారులు తొలగించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఎన్నికల అధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కొందరు వాలంటీర్లు వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల అధికారులు వారిని విధుల నుంచి తొలగించారు.
వాలంటీర్ల అత్యుత్సాహాం- వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు
అధికారుల కళ్లకు గంతలు- వైసీపీ వ్యూహంతో ఓటర్లకు ఊహించని తాయిలాలు