Governor Quota MLC Seats Case in High Court : మంత్రిమండలి పంపిన సిఫార్సులన్నీ యథాతథంగా ఆమోదించడానికి గవర్నర్ ఏమీ రబ్బరు స్టాంపు కాదని, వారు పంపించిన నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైతే వెనక్కి పంపే అధికారం గవర్నర్‌కు ఉందని గవర్నర్ కార్యాలయం తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. గతంలో తమ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
గవర్నర్ కార్యాలయం తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్‌కుమార్ వాదనలు కొనసాగిస్తూ రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారాన్ని వినియోగించుకునే హక్కు గవర్నర్‌కు ఉందని తెలిపారు. అనాలోచితంగా తిరస్కరించారన్న ఆరోపణ సరికాదని చెప్పారు. గవర్నర్ విధుల నిర్వహణకు సంబంధించి ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చి ఆదేశాలు ఇవ్వజాలరన్నారు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ నియామాకానికి సంబంధించి పేర్కొన్న అర్హతలు ఉన్నాయో లేవో గవర్నర్ పరిశీలించారని తెలిపారు. తగిన అర్హతలు లేకపోవడంతో మంత్రిమండలి సిఫార్సులను తిరస్కరించారని పేర్కొన్నారు. గవర్నర్ తిరస్కరణకు కారణాలను పేర్కొన్నందున వాటికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిమండలిపై ఉందన్నారు. ఇక్కడ పిటిషన్ వేయడానికి సరైన సమాచారం లేదని పేర్కొన్నారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఉత్తర్వులు అడిగారని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అయితే న్యాయసమీక్ష చేయరాదా అంటూ ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది సమాధానమిస్తూ న్యాయసమీక్ష చేయవచ్చని, అయితే ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేయాలని కానీ గవర్నర్‌కు కాదని తెలిపారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
ఎమ్మెల్సీలుగా దొడ్డిదారిన పంపాలన్న మంత్రిమండలి ప్రయత్నాలను గవర్నర్ అడ్డుకున్నారనగా, ధర్మాసనం స్పందిస్తూ రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహించాలని ప్రశ్నించింది. కొత్తగా నియమితులైన ఇద్దరు వ్యక్తుల నేపథ్యమేమిటన్న ప్రశ్నకు న్యాయవాది సమాధానమిస్తూ వారు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కాదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం గవర్నర్‌కు దురుద్దేశాలను ఆపాదించిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో సభను ఉద్దేశించి ప్రసగించడానికి అవకాశం ఇవ్వలేదని, ఇది రాజ్యాగంలోని అధికరణ 176కు విరుద్ధమని పేర్కొన్నారు. కోర్టును ఆశ్రయించిన తర్వాత దాని సూచనతో ఆహ్వానించిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. మొదటిసారి రిపబ్లిక్ డే వేడుకలను కూడా గత ప్రభుత్వం నిర్వహించలేదని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది : ముఖ్యమంత్రికి గవర్నర్ వ్యక్తిగతంగా ఆహ్వానం పంపినా స్పందిచలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ గవర్నర్‌కు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఇలాంటి సంఘటనలెన్నో ఉన్నాయని, గవర్నర్ అన్నీ ఆలోచించాకే తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకున్నారని, ఈ పిటిషన్లో ఉత్తర్వులు ఇవ్వడానికి ఎలాంటి కారణాలు లేవని, కొట్టివేయాలని కోర్టుకు విన్నవించారు. గత మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించి వెనక్కి పంపారని, అనంతరం తాజాగా మండలి చేసిన ప్రతిపాదనను గవర్నర్ ఆమోదించారని, అలాంటప్పుడు ఇక పిటిషన్లో తేల్చాల్సిన అంశాలేవీ లేవని ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ నివేదిక ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఎమ్మెల్సీ నామినేషన్ల సిఫార్సును గత ఏడాది సెప్టెంబరు 19న గవర్నర్ తిరస్కరించారని, ఇప్పుడు ఆ మంత్రిమండలి చేసిన తీర్మానం అమల్లో లేదన్నారు.
ఎమ్మెల్యే కోటా లాంఛనమే - గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై వీడని పీటముడి
తీర్మానాన్ని మళ్లీ పంపించి ఉంటే నిర్ణయం తీసుకునేవారు : పిటిషన్లో ఎమ్మెల్సీలుగా నామినేషన్లు స్వీకరించేలా ఆదేశించాలని కోరాలని, అలా అడిగే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. మంత్రిమండలి చేసిన సిఫార్సుల్లో అర్హతలను గవర్నర్ పరిశీలిస్తామన్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఆదేశించే అధికారం మంత్రిమండలికి లేదని స్పష్టం చేశారు. గత మంత్రిమండలి తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించారని, అనంతరం పిటిషినర్ల పాత్ర ఏమీలేదని చెప్పారు.
సెప్టెంబరులో మంత్రిమండలి నిర్ణయాన్ని గవర్నర్ తిరస్కరించారని తరువాత ప్రతిపాదనను తిరిగి గవర్నర్‌కు పంపలేదని చెప్పారు. మంత్రిమండలి రెండోసారి అవే పేర్లను ప్రతిపాదించి ఉన్నట్లు అయితే గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదని, ప్రభుత్వం తిరిగి పంపనప్పుడు విచారించడానికి అస్కారం లేదన్నారు. తమను ప్రతిపాదించలేదని మూడో వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడానికి వీలు లేదని తెలిపారు. ఇప్పుడు మంత్రిమండలి చేసిన తీర్మానాన్నే గవర్నర్ ఆమోదించారన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.