Governor CP Radhakrishnan on Agriculture Sector : ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. దేశం మూడో ఆర్థిక శక్తి హోదా కలిగి ఉందని చెప్పారు. శాస్త్రవేత్తలు, విద్యార్థులు పరిశోధనలు విస్తృతం చేయాలని అన్నారు. ఇతర దేశాల్లో ఆహార ధాన్యాలు సాగు పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పలు దేశాల్లో ఆహార కొరత ఏర్పడిందని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. ఆ సమయంలో కూడా భారత్ ఆహారోత్పత్తులపై ఆధారపడలేదని గుర్తు చేశారు. దేశంలో వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పెరుతున్నాయని అన్నారు. అగ్రికల్చర్‌లో పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్న వేళ, పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక వ్యవసాయం రైతులకు పరిచయం చేసి సత్తా నిరూపించాలని విద్యార్థులకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దిశానిర్దేశం చేశారు.
"రోజు రోజుకు ప్రజలు పాశ్చాత్య జీవన శైలి అలవర్చుకుంటున్నారు. ప్రపంచంలో అత్యంత ఉత్తమ జీవనశైలి , సంస్కృతి, సంప్రదాయాలు మనవి. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సంతోష సూచి చాలా తక్కువ. భారతదేశంలో మాత్రమే సంతోషం అధికం. ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్ మూడో ఆర్థిక శక్తి హోదా కలిగి ఉంది." - సీపీ రాధాకృష్ణన్, గవర్నర్
Prof Jayashankar University in Rajendranagar : దేశంలో మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గాయని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన జూన్ 9వ తేదీ చారిత్రాత్మక రోజు అని అన్నారు. అంతకుముందు ఆయన 587 మంది డిగ్రీ పట్టభద్రులకు, 752 మంది పీజీ పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేశారు.
అదేవిధంగా ఇద్దరు పీజీ పట్టభద్రులు, 19 మంది డిగ్రీ పట్టభద్రులకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బంగారు పతకాలు అందించారు. మరో 26 మంది పీహెచ్‌డీ పట్టాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఎండీ చల్లా శ్రీనివాసులు శెట్టి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఇంఛార్జ్ ఉపకులపతి ఎం.రఘునందన్ రావు, రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పక్షులు, అడవిపందుల నుంచి రక్షణ - ఈ కెనాన్తో మీ పంటలు సురక్షితం