Government has Started Control Kidney Disease in NTR District : కొత్త ప్రభుత్వం రాకతో ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కిడ్నీ వ్యాధులు గిరిజనుల్ని పీల్చి పిప్పిచేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోంది. గత ఐదేళ్లలో పెద్ద సంఖ్యలో బాధితులు మరణించగా, వందల సంఖ్యలో కిడ్నీ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. కిడ్నీవ్యాధులకు ప్రధాన కారణం తాగునీరేనని గుర్తించినప్పటికీ స్వచ్ఛ జలాలు అందించడంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైంది. కొత్త ప్రభుత్వం వచ్చాక తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా నిరంతరం అందిస్తున్నారు. మరోవైపు శాశ్వత ప్రాతిపదికన కృష్ణా జలాలను అందించేలా ప్రాజెక్టు రూపకల్పనకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది.
Kidney Diseases: కిడ్నీ సమస్యలతో బతుకు పోరాటం చేస్తున్న ఏ. కొండూరు మండల వాసులు..
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధుల సమస్య ఇప్పటిది కాదు. స్వచ్ఛమైన తాగునీరందక 22 గిరిజన తండాల్లో వందల మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. మూడేళ్లలో 200 మందికి పైగా గిరిజనులు మృత్యువాతపడ్డారు. దీనికి ప్రధాన కారణం తాగునీటిలో ఫ్లోరైడ్, సిలికాన్ మోతాదులు ఎక్కువ ఉండడమే. గత ఐదేళ్లలో గుత్తేదారుకు బిల్లులు చెల్లించక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సరిగ్గా జరలేదు. ఫలితంగా ఎంతో మంది కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. కూటమి సర్కారు వచ్చిన వెంటనే కిడ్నీ సమస్యపై దృష్టి సారించింది. 17 తండాల్లో ట్యాంకులు ఏర్పాటు చేసి అధికారులు నీటిని తెచ్చి పోస్తున్నారు. గతంలో గుత్తేదారులకు చెల్లించాల్సిన నీటి బకాయిలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం కోటి 60 లక్షల రూపాయలను మంజూరు చేసింది. గ్రామాల్లో పైపులైన్ల పనులు సైతం ఊపందుకున్నాయి.
కృష్ణా జలాల శాశ్వత ప్రాజెక్టు పూర్తైతే ఎ.కొండూరు మండలంలోని 12 గిరిజన గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 21 పంచాయతీల పరిధిలోని 40వేల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. రాష్ట్రప్రభుత్వం 20 శాతం వాటా నిధులు విడుదల చేస్తే జలజీవన్ మిషన్ కింద కేంద్రం 80 శాతం వాటా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయినా గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి ఈ ప్రాజెక్టు కోసం కనీసం దస్త్రం కూడా కేంద్రానికి పంపలేదు. ఈ ప్రాజెక్టు కోసం 50 కోట్లను ప్రభుత్వం నుంచి విడుదల చేస్తానంటూ అప్పటి సీఎం జగన్ తిరువూరు బహిరంగ సభలో ప్రకటించినా అడుగులు ముందుకు పడలేదు. ఇప్పుడు జలజీవన్ మిషన్ కింద కృష్ణా జలాల ప్రాజెక్టును ఎన్టీయే ప్రభుత్వం పట్టాలెక్కించేందుకు కృషి చేస్తోంది. జిల్లాయంత్రాంగం ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక, అంచనాలు తయారు చేయాలని గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
గిరిజనులకు స్వచ్ఛమైన జలాలు అందించే కృష్ణా జలాల ప్రాజెక్టు పూర్తయితే కిడ్నీ బాధితులకు పెద్ద ఉపశమనమే అవుతుందని గిరిజన నాయకులు అంటున్నారు. త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.