108 AMBULANCE EMPLOYEES STRIKE: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన సమ్మె నోటీసు గడువు నేటితో ముగిసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్ ఉద్యోగులు తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్‌లో 108 అంబులెన్స్ ఉద్యోగులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని 15 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు కొద్ది రోజుల క్రితం ఇచ్చామన్నారు. నోటీసు ఇచ్చి 14 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
108 ఉద్యోగుల నిర్వహణ బాధ్యత ప్రైవేట్ వారికి ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఉద్యోగులకు 8 గంటల పని, మూడు షిఫ్టులుగా చేయాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్తే జరిగే ప్రాణ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.