Government Planned To R&B Roads Under PPP Model : ప్రస్తుతం జాతీయ రహదారులపై వాహనాల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. హైవేలపై ఎక్కడా గుంతలు కనిపించవు. ఐదేళ్లకోసారి తప్పనిసరిగా కొత్త బీటీ లేయర్ వేస్తారు. ఎందుకంటే మొత్తం నిర్వహణంతా గుత్తేదారే చూసుకుంటారు కాబట్టి. ఇకపై రాష్ట్రంలోని పలు ఆర్‌అండ్‌బీ రోడ్లలో కూడా ఇటువంటి విధానమే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం (PPP) ద్వారా గుత్తేదార్లకు రోడ్ల నిర్వహణ అప్పగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
రోడ్ల బాధ్యతంతా గుత్తేదారులదే : ఏటా ఆయా రోడ్లలో వర్షాలకు గుంతలు పడితే వాటిని పూడ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు కోసం ఎదురుచూడటం, ఐదేళ్లకోసారి రెన్యువల్స్ వేసేందుకు అనుమతులు తీసుకోవడం వంటివి ఇకపై ఉండవు. చివరకు రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కల తొలగింపు కోసం కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధుల కేటాయింపునకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇకపై ఇటువంటిదేమీ లేకుండా పీపీపీ విధానంలో ఆయా రోడ్ల నిర్వహణ బాధ్యత మొత్తాన్ని గుత్తేదారే చూసుకుంటారు. వాహన రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారు (State Highway)ల్లో తొలి విడత 18 రోడ్లను, అనంతరం రెండో విడతలో 68 రోడ్లను ఎంపిక చేశారు.
రహదారుల కోసం సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచన - గోదావరి జిల్లాల నుంచే అమలు
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం : ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం మొదటి విడత కింద ఎంపిక చేసిన 18 రోడ్లలో 1,307 కి.మీ వరకు అధ్యయనం చేస్తారు. అలాగే రెండో విడతలోని 68 రోడ్లకు చెందిన 3,931 కి.మీ.లలో పీపీపీ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగానే సలహా సంస్థలను ఎంపిక చేసుకొని, నివేదిక రూపొందించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు నిధులు కూడా మంజూరు చేసింది. ఆయా రోడ్లలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది? మున్ముందు ఎంత పెరిగే అవకాశం ఉంటుంది? ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు కాకుండా ఇతర వాహనాలకు టోల్ ద్వారా ఎంత వసూలవుతుంది అనేవి అధ్యయనం చేయనుంది. అంతే కాకుండా గుత్తేదారుకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ కింద ఎంత చెల్లించాల్సి ఉంటుంది? అనేవి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.
రోడ్లపై గోతులు పూడ్చేందుకు రూ.210 కోట్లు విడుదల - ఉత్తర్వులు జారీ
ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన గడ్కరీ - 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులు మంజూరు