Government Towards Road Construction in Tribal Areas in AP : రాష్ట్రాన్ని డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దశల వారీగా మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి దశలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 9 రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిందిగా అధికారులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. గిరిజన గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానించేందుకు దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
New Roads to Remote Villages in AP : దేశం సాంకేతికంగా ఎంతో ఎదిగినా రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. కొండలపై విసిరేసినట్లుగా ఉండే గిరిజన గ్రామాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తితే డోలీపై మోసుకెళ్లాల్సిందే. సకాలంలో వైద్యం అందక కొంత మంది మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. డోలీ మోతల కష్టాల నుంచి గిరిజనులను గట్టెక్కించడంపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మారుమూల గిరిజన గ్రామాల నుంచి సమీపంలోని ప్రధాన రహదారులను కలిపేలా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
గర్భిణికి పురిటి నొప్పులు - ఏరులో నుంచే ఆస్పత్రికి తరలింపు
ఈ అంశంపై సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించారు. ముందుగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తొలి దశలో 18.85 కిలో మీటర్ల మేర తొమ్మిది రహదారులను 49.73 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. తద్వారా 20 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలగనుంది. కేంద్రం నిధుల కోసం వేచిచూడకుండా రాష్ట్ర నిధులు, ఉపాధి హామీ మెటీరియల్ నిధులతో రోడ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 499 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేనట్లు అధికారులు గుర్తించారు. తొలి దశలో 9 రోడ్ల నిర్మాణం చేపట్టనుండగా ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గ్రామంలో రోడ్ల పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఐదు సంవత్సరాల్లో దశల వారీగా అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నారు.